ఎదురుచూపులు!..ఓరుగల్లు కలెక్టర్‍ బంగ్లాను..హెరిటేజ్‍ భవన్‍ చేయలే

ఎదురుచూపులు!..ఓరుగల్లు కలెక్టర్‍ బంగ్లాను..హెరిటేజ్‍ భవన్‍ చేయలే
  •     140 ఏండ్ల బ్రిటిష్, నిజాం పాలనకు సాక్ష్యంగా వారసత్వ భవనం  
  •     13 ఎకరాల్లో.. 22 గదులతో విశాలమైన బిల్డింగ్
  •     టూరిజం హెరిటేజ్‍ భవన్‍ చేసి మహిళా సంఘాలకు ఇస్తామన్న 'కుడా'
  •     రూ.2 కోట్లకుపైగా నిధులతో ఏడాదికింద రిపేర్లు పూర్తి

వరంగల్, వెలుగు: ఉమ్మడి జిల్లా కలెక్టర్ బంగ్లా ఇప్పటికీ హెరిటేజ్ భవన్‌‌‌‌గా మారలేదు. 1886లో హనుమకొండ సుబేదారిలో నిర్మితమైన ఈ చారిత్రక భవనం బ్రిటిష్, నిజాం పాలనకు 140 ఏండ్ల సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. దీనిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి భావితరాలకు వారసత్వ సంపదగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.2 కోట్లతో మరమ్మతులు చేపట్టింది. గోడలకు రంగులు, పాత నిర్మాణాన్ని పునరుద్ధరించడం, అందమైన గార్డెన్​ ఏర్పాటు చేయడం వంటి పనులు పూర్తయ్యాయి. పనులు పూర్తయ్యాక హెరిటేజ్ భవన్‌‌గా ప్రకటించి పర్యాటకులకు అందుబాటులో ఉంచుతామని, నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించి వారికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. అయితే గతేడాది జూన్‌‌లోనే పనులు పూర్తయినా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. దీంతో చారిత్రక బంగ్లాను సందర్శించాలని ఎదురుచూస్తున్న పర్యాటకులతో పాటు నిర్వహణ బాధ్యతలు వస్తాయని ఆశిస్తున్న మహిళా సంఘాలకు ఎదురు చూపులు తప్పడం లేదు.

ఓరుగల్లు నుంచే సుబేదార్ పాలన..

ఉమ్మడి వరంగల్ కేంద్రంగా 24 అంతస్తుల బిల్డింగులు, అపార్ట్‌‌మెంట్లు, విల్లాలతో విస్తరించినప్పటికీ, కలెక్టర్ బంగ్లా తన చారిత్రక వైభవాన్ని కోల్పోలేదు. ఖులీ కుతుబ్ షాహీల తర్వాత అసఫ్ జాహీలు దక్కన్ ప్రాంతాన్ని పాలించారు. పరిపాలనా సౌలభ్యానికి తమ రాజ్యాన్ని సుభాలుగా విభజించారు. ప్రతి సుభాకు తరఫ్దార్ లేదా సుబేదార్ స్థాయి అధికారిని నియమించేవారు. తానీషా కాలంలో గోల్కొండ రాజ్యం 6 సుభాలుగా ఉండగా, వాటిలో వరంగల్ ఒకటి. ఈ సుభా పరిధిలో ఎలగందుల (కరీంనగర్), స్తంభగిరి (ఖమ్మం), దేవరకొండ (నల్గొండ), వరంగల్ సర్కార్లు ఉండేవి. వీటన్నింటికీ ఓరుగల్లు పరిపాలనా కేంద్రంగా ఉండేది. 1853లో సాలార్ జంగ్ నిజాం రాజ్యాన్ని 5 సుభాలు, 17 జిల్లాలుగా మార్చాడు. 1875లో వరంగల్‌‌లో భూసర్వే శాఖ, రెవెన్యూ బోర్డు ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో 1886 ఆగస్టు 10న బ్రిటిష్ అధికారి జార్జ్ పాల్మార్ భార్య ఈ బంగ్లా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం దీనిని సుబేదార్ అధికార నివాసంగా ఉపయోగించడంతో ఆ ప్రాంతానికి ‘సుబేదారి’ అనే పేరు వచ్చింది.

13 ఎకరాల్లో రాజసం ఉట్టిపడే నిర్మాణం..

ఓరుగల్లు కేంద్రంలో 13 ఎకరాల్లో నిర్మించిన ఈ కలెక్టర్ బంగ్లా అడుగడుగునా రాజసాన్ని ప్రతిబింబిస్తుంది. వరదలు, ప్రకృతి విపత్తులు తట్టుకునేలా డంగు సున్నంతో నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉంది. ప్రవేశం దగ్గర కమాన్​పై పెద్ద గడియారం ఏర్పాటు చేశారు. కమాన్​కు ఇరువైపులా కాపలాదారుల కోసం ప్రత్యేక గదులు నిర్మించారు. ప్రాంగణంలో వందల రకాల పూలు, పండ్ల  చెట్లు పెంచారు. భవనం ఎదురుగా భారీ ఫౌంటెన్ కనువిందు చేస్తుంది. లోపల గాలి, వెలుతురు సమృద్ధిగా వచ్చేలా మొత్తం 22 గదులను నిర్మించారు. ప్రవేశించగానే అతిథుల కోసం 44 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో విశాలమైన హాలు ఉంది. దీని పైకప్పు 22 అడుగుల ఎత్తులో ఉంది. 

రాజరిక వైభవానికి ప్రతీకగా ఉన్న శాండిలియర్లు నేటికీ చెక్కుచెదరలేదు. కరెంటు లేని రోజుల్లో వీటిలో వెలిగించేందుకు పొగరాని, మసిపట్టని ప్రత్యేక కొవ్వొత్తులను లండన్ నుంచి దిగుమతి చేసుకునేవారు. ప్రధాన హాలుకు ఎడమవైపు 8, కుడివైపు 7 గదులు ఉన్నాయి. స్నానాల గది కూడా 13 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో విశాలంగా నిర్మించారు. భవనం చుట్టూ 10 అడుగుల వెడల్పుతో పోర్టికో ఉంది. చెక్క మెట్ల ద్వారా మొదటి అంతస్తుకు వెళ్తే విశాలమైన టెర్రస్‌‌తో పాటు పెద్ద హాలు, మరో 3 గదులు కనిపిస్తాయి. అక్కడి నుంచి బంగ్లా పరిసరాల అందాలు కనువిందు చేస్తాయి. 1948 సెప్టెంబర్ 17 వరకు ఈ భవనాన్ని సుబేదార్లు నివాసంగా ఉపయోగించారు. 1950 నుంచి ప్రభుత్వ అధికార నివాసంగా మారింది. వరంగల్ తొలి కలెక్టర్ ఎం.వి. రాజ్వేద నుంచి ప్రావీణ్య వరకు మొత్తం 43 మంది కలెక్టర్లు, పలువురు ఇన్‌‌చార్జి కలెక్టర్లు ఈ బంగ్లాలో నివసించారు. 

హెరిటేజ్‍ భవన్‍ కోసం ఇంకా నిరీక్షణే.. 

రాష్ట్ర పురావస్తు శాఖ ఈ 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని కలెక్టర్ బంగ్లాను వారసత్వ సంపదగా గుర్తించింది. అనంతరం కాకతీయ అర్బన్ డెవలప్‌‌మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో రూ.2 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. దెబ్బతిన్న గోడలు, స్లాబ్ రింగ్ భాగాలను డంగు సున్నంతో మరమ్మతు చేశారు. ఆధునిక లైటింగ్, పెయింటింగ్‌‌తో పాటు టెంపుల్ ట్రీ, రాయల్ పామ్, యూకో ఫెల్లం, లాంటానా, స్పైడర్ లిల్లీ, వెడేలియా రుబ్రా తదితర అలంకార మొక్కలతో గార్డెన్​ఏర్పాటు చేశారు. లైబ్రరీ, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా అభివృద్ధి చేసి హెరిటేజ్ స్పాట్‌‌గా మార్చుతామని ప్రభుత్వం ప్రకటించింది. నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించి వారికి ఉపాధి కల్పిస్తామని కూడా తెలిపింది. అయితే పనులు పూర్తై ఏడాది దాటినా కలెక్టర్ బంగ్లా ఇంకా హెరిటేజ్ భవన్‌‌ హోదా ప్రకటించలేదు.