వెలుగు ఓపెన్ పేజీ..ఆద్యకళకు ఇన్ని అడ్డంకులెందుకు?

వెలుగు ఓపెన్  పేజీ..ఆద్యకళకు ఇన్ని అడ్డంకులెందుకు?

అర్ధశతాబ్ద కాలంగా ప్రొ. జయధీర్ తిరుమలరావు సేకరిస్తూ వస్తున్న పురావస్తు  కళాఖండాల సంఖ్య వందల్లోంచి వేలల్లోకి మారడంతో వాటి సంరక్షణ ఆయన తలకు మించిన భారమైంది.  వాటి భద్రత,  ప్రదర్శన కోసం ఆద్య కళ మ్యూజియం  ఏర్పాటు చేయమని ఇరవై ఏళ్లుగా ఆయన కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నారు.  తెలంగాణ తొలి ప్రభుత్వం ఆయన మొర ఆలకించలేదు. ఆ విలువైన సేకరణ వివరాలను సీఎం రేవంత్ రెడ్డి సావధానంగా విని, ఆద్య కళ ఆవశ్యకత పట్ల సానుకూలంగా స్పందించారు.

ఆయన  వ్యక్తిగత చొరవ వల్లనే  తెలుగు యూనివర్సిటీ,  నాంపల్లిలోని  భవనాలను ఆద్య కళకు  కేటాయిస్తూ  జీఓ వచ్చింది.  వయోవృద్దులైన తిరుమలరావు కష్టాలు  ఇన్నాళ్ళకైనా తీరాయని అనుకుంటున్న తరుణంలో ఊహించని రీతిలో తెలుగు యూనివర్సిటీ విద్యార్థుల నుంచి  ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత మొదలైంది. ఆద్యకళ ఏర్పాటుకు యూనివర్సిటీ  భవనాల  కేటాయింపును  వెనక్కి తీసుకోవాలంటూ వారు యూనివర్సిటీ  ముందు ప్రదర్శనలు చేశారు.  దీంతో ఆ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకున్నట్లు వార్తలు వచ్చాయి.

ఆద్య కళను కాపాడుకుందాం 

మరోవైపు ఆద్య కళ పరిరక్షణ కమిటీ కూడా ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వును అమలు చేయాలంటూ పత్రికా ప్రకటనలు ఇస్తూ సదస్సులు నిర్వహిస్తోంది. తిరుమలరావు కృషి పట్ల గౌరవం, ఆయన కూడబెట్టిన అపురూప కళాఖండాల  సంరక్షణ పట్ల బెంగ ఉన్న మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, రచయితలు ఆయనకు అండగా మాట్లాడుతున్నారు. ఆయనకు మద్దతుగా సమావేశమై ఆద్య కళను కాపాడుకుందాం అని పిలుపును ఇస్తున్నారు. 

తెలంగాణ బుద్ధిజీవులు ఆయన వెంట ఉన్నట్లు ఈ సదస్సుల ద్వారా తెలుస్తోంది.  ఇలా గత 20 రోజులుగా భవన కేటాయింపు ఉత్తర్వుకు అనుకూలంగా, ప్రతికూలంగా సాగుతున్న ఆందోళనల,  సదస్సుల మధ్య ప్రభుత్వ తాజా నిర్ణయం విద్యార్థులు పక్షాన ఉంది.  నాంపల్లిలో గత నలభై ఏళ్లుగా కొనసాగుతున్న తెలుగు విశ్వవిద్యాలయం ఏడాది క్రితం బాచుపల్లిలోని నూతన భవనాల్లోకి మారింది.  100 ఎకరాల ప్రాంగణంలో ఆఫీసులు, క్లాస్ రూమ్స్, హాస్టల్స్, లైబ్రరీ, ఆడిటోరియం.. ఇలా అన్ని సౌకర్యాలు అక్కడ ఏర్పడ్డాయి. భూమి కేటాయించిన 23 ఏళ్ల తర్వాత ఈ కల సాకారమైంది.  ఏనాటికైనా తెలుగు విశ్వవిద్యాలయం శాశ్వత చిరునామా అక్కడే. 

వారసత్వ సంపద  భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి

కేటాయింపును వద్దనేవారు  పాత ప్రాంగణంలో  ఇప్పటికీ జ్యోతిష్యం,  ఫ్యాషన్ డిజైనింగ్,  యోగా క్లాసులు జరుగుతున్నాయని, ఆ కోర్సుల్లో 600 మంది విద్యార్థులు ఉన్నారని అంటున్నారు.  ఈ సువిశాలమైన ప్రాంగణంలో  గ్రౌండ్ ఫ్లోర్  మాత్రమే ఆద్య కళ కోసం ప్రభుత్వం కేటాయించింది.  ప్రభుత్వ ఉత్తర్వు స్థలవాడకం కోసమే తప్ప భవనాలను తిరుమలరావుకు ధారాదత్తం చేయడం లేదు.  విద్యార్థులకు వ్యతిరేకించే హక్కు ఉంది.  

అయితే ఒక ప్రైవేట్ వ్యక్తికి,  ప్రైవేట్ సంస్థకు భవనాలు అప్పగిస్తున్నారని వారు ఆరోపించడం మాత్రం అర్థరహితం, విచారకరం.  తెలుగు విశ్వ విద్యాలయంలో తిరుమలరావు ప్రొఫెసర్​గా పనిచేసిన విషయం వారికి తెలియనిది కాదు.  ఇప్పటికే ఆ ప్రాంగణంలో ఉన్న పురాతన వస్తువులను బయట వేస్తామని అనడం అందరూ గర్హించదగిన మాట.  యూనివర్సిటీ  ప్రాంగణాన్ని  సొంత ఆస్తిలా భ్రమపడి తొందరపాటు మాటలు తూలకూడదు.  కొందరు కావాలని ఆద్యకళకు అడ్డు పడుతున్నారనిపిస్తోంది. 

యూనివర్సిటీ అధికారులతో చర్చించకుండా,  ఖాళీ స్థలం ఎంతుంది అనే అంచనా లేకుండా ప్రభుత్వం జీఓ ఇవ్వాల్సింది కాదు.  దానివల్ల అనవసర ఘర్షణ వాతావరణం ఏర్పడింది.  దీనివల్ల ఇప్పటికే నాంపల్లి ప్రాంగణంలో ఉన్న ఆద్యకళ సామగ్రికి కూడా భద్రత కరువయ్యే  ప్రమాదం ఏర్పడింది.  ప్రభుత్వం తక్షణం స్పందించి మరో నీడను ఆద్య కళకు కల్పించాలి.  అందాకా  ప్రస్తుత ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలాన్ని తాత్కాలికంగానైనా ఆద్య కళకు వినియోగించుకునేలా ఉత్తర్వులు విడిగా జారీ చేయాలి.  ఏ పక్షం వారైనా వారసత్వ సంపద,  మానవ నాగరికతకు ఆనవాళ్లయిన కళాఖండాల  భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి.  జీఓను  ఉపసంహరించుకున్న  ప్రభుత్వమే సత్వరం  మరో నిర్ణయం తీసుకోవాలి.


 

-బద్రి నర్సన్
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.