వరుసగా రెండోసారి ఫైనల్‎కు అర్జెంటీనా.. చివరి 7 నిమిషాల్లో ఇంగ్లాండ్‎ను మట్టికరిపించిన మెస్సీ సేన

వరుసగా రెండోసారి ఫైనల్‎కు అర్జెంటీనా.. చివరి 7 నిమిషాల్లో ఇంగ్లాండ్‎ను మట్టికరిపించిన మెస్సీ సేన

అట్లాంటా: ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఢిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్‎కు దూసుకెళ్లింది. అట్లాంటా స్టేడియం వేదికగా ఉత్కంఠభరింతంగా సాగిన సెమీ-ఫైనల్‌లో 2-1 తేడాతో తమ చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్‎ను చిత్తు చేసింది అర్జెంటీనా. గేమ్ చివరి ఏడు నిమిషాల్లో ఎంజో ఫెర్నాండెజ్, లౌటారో మార్టినెజ్ రెండు సూపర్ గోల్స్ చేసి అర్జెంటీనాకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. తద్వారా ఫిఫా వరల్డ్ కప్‎లో వరుసగా రెండోసారి అర్జెంటీనా ఫైనల్‎కు చేరుకుంది. టైటిల్ నెలబెట్టుకునేందుకు జూలై 19న జరగనున్న ఫైనల్‎లో స్పెయిన్‎తో అమీతుమీ తేల్చుకోనుంది మెస్సీ సేన. 

ఫస్టాఫ్‎లో హోరా హోరీ:

చిరకాల ప్రత్యర్థులు అర్జెంటీనా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ పోరు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఫస్టాఫ్‎లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. గోల్ కోసం రెండు జట్లు తీవ్రంగా శ్రమించాయి. కానీ ఇరు జట్ల బలమైన డిఫెన్స్ కారణంగా ఒక్క గోల్ కూడా నమోదు కాకుండా తొలి అర్థ భాగం ముగిసింది.

చివరి ఏడు నిమిషాల్లో మెస్సీ సేన మ్యాజిక్:

ఫస్టాఫ్‎లో ఆచీతూచీ ఆడిన ఇంగ్లాండ్ సెకండాఫ్‎లో పుంజుకుంది. మ్యాచ్ 55వ నిమిషంలో ఆంటోనీ గోర్డాన్ గోల్ సాధించి ఇంగ్లాండ్‎ను అధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత స్కోర్ ను సమం చేసేందుకు అర్జెంటీనా తీవ్రంగా పోరాడింది. ఈ క్రమంలో మ్యాచ్ 85వ నిమిషంలో స్టార్ ప్లేయర్ మెస్సీ అందించిన పాస్‎ను ఫెర్నాండెజ్ గోల్‎గా మలిచి స్కోరును సమం చేశాడు.

 దీంతో మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది. ఎక్స్ట్రా టైమ్ 90+2వ నిమిషంలో మెస్సీ అందించిన పాస్‏ను మార్టినేజ్ అద్భుతమైన హెడర్‎తో గోల్ సాధించాడు. మ్యాచ్ చివరి ఏడు నిమిషాల్లో రెండు అద్భుతమైన గోల్స్ సాధించింది తమ చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్‎ను చిత్తు చేసి అర్జెంటీనా వరుసగా రెండోసారి ఫైనల్‎కు దూసుకెళ్లింది.