- సూర్యాపేట జిల్లాలో వేధిస్తున్నాడని కొడుకును చంపిన తల్లి
- ఆసిఫాబాద్ జిల్లాలో మేనమామను చంపిన యువకులు
- నిర్మల్ జిల్లాలో యువకుడు, సంగారెడ్డి జిలాల్లో వ్యక్తి హత్య
సూర్యాపేట, వెలుగు : మద్యానికి బానిసై రోజూ వేధిస్తున్నాడన్న కోపంతో ఓ మహిళ తన కొడుకును హత్య చేసింది. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన భుక్యా అచ్చి భర్త చనిపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది.
ఇద్దరు కుమార్తెల పెండ్లిళ్లు కాగా, కుమారుడు విజయ్ (28)తో కలిసి ఉంటోంది. విజయ్ ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మద్యం, మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. మత్తులో ప్రతి రోజు తల్లితో గొడవ పడుతూ డబ్బుల కోసం ఇబ్బంది పెట్టేవాడు. దీంతో అచ్చి తనకున్న ఇల్లు, స్థలాన్ని కూడా అమ్మి డబ్బులను విజయ్ కి ఇచ్చింది. అయినా అతడిలో మార్పు రాలేదు. ఈ నెల 12న రాత్రి విజయ్ తాగొచ్చి తల్లిని వేధించడం మొదలుపెట్టాడు.
దీంతో ఆగ్రహానికి గురైన అచ్చి గొడ్డలితో విజయ్ పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత అచ్చి బయటకు వచ్చి చుట్టుపక్కల వారిని పిలిచి తాను బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి విజయ్ పై దాడి చేసి పారిపోయారని నమ్మించింది. స్థానికుల సాయంతో విజయ్ ని సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ సోమవారం రాత్రి చనిపోయాడు. విజయ్ అక్క ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులకు అచ్చి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో తానే చంపేసినట్లు ఒప్పుకుంది.
మేనమామను హత్య చేసిన యువకులు
ఆసిఫాబాద్, వెలుగు : తమ మేనకోడలి ప్రేమ వ్యవహారానికి సహకరిస్తున్నాడన్న కోపంతో ఇద్దరు యువకులు కలిసి తమ మేనమామను హత్య చేశారు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపూర్ ఎస్సీ కాలనీకి చెందిన వేమునూరి స్వామి (48) కూలీగా పనిచేస్తున్నాడు. స్వామికి కాగజ్ నగర్ మండలం గెర్రగూడ రాస్పల్లి గ్రామానికి చెందిన ఇరిగిరాల తిరుపతి, వెంకటేశ్ మేనల్లుండ్లు. స్వామి అన్న కొడుకు తమ మేనకోడలితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని, అతడికి స్వామి సహకరిస్తున్నాడని తిరుపతి, వెంకటేశ్ కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇద్దరూ కలిసి బైక్ పై వచ్చి స్వామిని గ్రామ శివారులోకి తీసుకెళ్లి తమ వెంట తెచ్చుకున్న ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. ఘటనాస్థలాన్ని ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్‌ఐ వెంకటకృష్ణ పరిశీలించారు.
నిర్మల్లో యువకుడు...
నిర్మల్, వెలుగు : గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కాలనీలో జరిగింది. కాలనీకి చెందిన అస్లాం (23) పై బుధవారం ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అస్లాంను జిల్లా హాస్పిటల్ కు తరలించగా ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ హత్య వ్యక్తిగత కారణాలతోనే జరిగిందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు.
రోడ్డుకు అడ్డంగా నిలబడ్డాడని కారుతో గుద్ది హత్య
సంగారెడ్డి, వెలుగు : రోడ్డుకు అడ్డంగా నిలబడ్డాడని జరిగిన గొడవ ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అంబేద్కర్ కాలనీకి చెందిన కాశీపురం ఆంజనేయులు మంగళవారం రాత్రి తన కారులో వెళ్తున్నాడు. కంది గ్రామంలోకి రాగానే బూడిద చక్రి రోడ్డుపై నిలబడడంతో ఎలా వెళ్లాలంటూ ఆంజనేయులు గొడవ పడ్డాడు. గమనించిన చక్రి తండ్రి రమేశ్ అక్కడికి వచ్చి ఏం జరిగిందని ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే ఆంజనేయులు తన కారుతో రమేశ్ ను బలంగా ఢీకొట్టాడు. గాయపడిన రమేశ్ ను ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు.
