పిల్లల కరెన్సీతో మోసాలు,ముగ్గురు అరెస్ట్ ... తుర్కపల్లి పోలీసుల అదుపులో నిందితులు

పిల్లల కరెన్సీతో మోసాలు,ముగ్గురు అరెస్ట్ ... తుర్కపల్లి పోలీసుల అదుపులో నిందితులు

యాదగిరిగుట్ట, వెలుగు : చిన్నపిల్లలు ఆడుకునే కరెన్సీ నోట్లతో మోసాలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను తుర్కపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తుర్కపల్లి ఎస్సై తక్యుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ సమీపంలోని కుంట్లూరు గ్రామానికి చెందిన మద్దెబోయిన నాగరాజు, భువనగిరికి చెందిన ముదురుకోల యాకంబరం, ముదురుకోల దేవేందర్ కలిసి రూ. లక్షకు రూ. 2 లక్షలు ఇస్తామంటూ పలువురిని నమ్మించారు. 

ఈ క్రమంలో ఇటీవల తుర్కపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ. లక్ష తీసుకొని రూ. 2 లక్షల నోట్లు అప్పగించారు. కొద్ది సేపటి తర్వాత సదరు వ్యకక్తి ఆ నోట్ల కట్టలను పరిశీలించగా... పైన, కింద మాత్రమే ఒరిజినల్ నోట్లు ఉండి.. మధ్యలో చిన్న పిల్లలు ఆడుకునే కరెన్సీ నోట్లు కనిపించాయి. 

దీంతో మోసపోయానని గ్రహించిన సదరు వ్యక్తి మంగళవారం తుర్కపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు భువనగిరికి  చెందిన యాకంబరంను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతడు ఇచ్చిన సమాచారంతో దేవేందర్, నాగరాజును సైతం అరెస్ట్ చేశారు. ముగ్గురిని బుధవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.