సీఎంఆర్ రికవరీకి డెడ్ లైన్ 20 రోజులే... మిల్లర్లు ఇంకా బియ్యం ఇయ్యట్లే.. డబ్బులు కట్టట్లే

సీఎంఆర్ రికవరీకి  డెడ్ లైన్ 20 రోజులే... మిల్లర్లు ఇంకా బియ్యం ఇయ్యట్లే.. డబ్బులు కట్టట్లే
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ. 850 కోట్ల సీఎంఆర్ బకాయిలు 
  • ఆగస్టు 5తో ముగియనున్న గడువు.. కానీ3శాతం కూడా రికవరీ కాలే..
  • పీడీ యాక్ట్, జైలు బెదిరింపులను లైట్ తీసుకుంటున్న మిల్లర్లు

నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్​) ఇవ్వకుండా, దానికి సమానమైన డబ్బులు కట్టకుండా కొందరు మిల్లర్లు కాలయాపన చేస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన వేల క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లింగ్ కోసం తీసుకెళ్లి, గింజ కూడా తిరిగివ్వకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మింగేస్తున్నారు. 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వానికి రావాల్సిన ఈ బకాయిలు సుమారు రూ. 850 కోట్లకు చేరాయి. తప్పు చేసిన వారిపై పీడీ యాక్ట్ పెడతాం, జైలుకు పంపుతామని అధికారులు పైకి గంభీర ప్రకటనలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో రికవరీ మాత్రం 3 శాతం కూడా దాటకపోవడం గమనార్హం.

మిల్లర్ల దగ్గర 2లక్షల మెట్రిక్ టన్నులు 

ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకున్న నిర్ణీత కాలంలోనే మిల్లర్లు బియ్యాన్ని తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. కానీ, 2022-–23 యాసంగి సీజన్‌‌కు సంబంధించి ఉమ్మడి జిల్లాలోని సుమారు 200 మంది మిల్లర్ల వద్ద 2,47,416 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు నిలిచిపోయాయి. దీనిపై ప్రభుత్వం 2024లో టెండర్లు వేయగా, టెండర్ దక్కించుకున్న వారికి మిల్లర్లు కేవలం 9 శాతం ధాన్యాన్ని మాత్రమే అప్పగించారు. 

మిగిలిన స్టాక్‌‌ను బహిరంగ మార్కెట్​లో భారీ ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తీరా అధికారులు మిల్లుల్లో తనిఖీలు చేస్తే నిల్వలు కనిపించడం లేదు. నిలదీస్తే కోర్టులను ఆశ్రయిస్తున్నారు.  

ఆగష్టు 5 డెడ్ లైన్

ఈ మొండి బకాయిల వసూలు కోసం పౌరసరఫరాల శాఖ గతంలో పలుమార్లు గడువులు విధించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. బియ్యం ఇవ్వకపోతే మిల్లులను సీజ్ చేస్తామని, ఆర్‌‌ఆర్‌‌ (రెవెన్యూ రికవరీ) యాక్ట్ కింద ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరిస్తూ.. తాజాగా ఆగస్టు 5ను చివరి డెడ్ లైన్‌‌గా ప్రకటించింది. అయితే ఈ హెచ్చరికలను మిల్లర్లు అస్సలు ఖాతరు చేయడం లేదు. దీని వెనుక కొందరు జిల్లా స్థాయి అధికారుల మామూళ్ల మత్తు, లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వసూలైంది గోరంత.. బాకీ కొండంత

ప్రస్తుతం వసూలైంది గోరంత, బాకీ కొండంత అన్నట్లుగా ఉంది. నల్గొండ జిల్లాలోని 58 మిల్లుల నుంచి రూ. 248.61 కోట్లు రావాల్సి ఉండగా,  కేవలం రూ. 18 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. సూర్యాపేట జిల్లాలోని 64 మిల్లులు రూ. 558 కోట్ల భారీ బకాయిలు పడగా, అక్కడ రికవరీ అయింది కేవలం రూ. 7 కోట్లు మాత్రమే. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో రూ. 850 కోట్ల బకాయిలకు గానూ కేవలం రూ. 22 నుంచి రూ.25 కోట్లు మాత్రమే రికవరీ కాగా, ఇంకా రూ. 820 కోట్లకు పైగా పెండింగ్‌‌లోనే ఉంది. కండ్ల ముందే వందల కోట్ల ప్రజాధనం పక్కదారి పడుతున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, ఇకనైనా ప్రకటనలకే పరిమితం కాకుండా మొండి మిల్లర్ల ఆస్తులను, మిల్లులను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.