భారత్ vs పాక్ మ్యాచ్‌ల కోసం ఐసీసీ సంచలన మార్పులు.. క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!

భారత్ vs పాక్ మ్యాచ్‌ల కోసం ఐసీసీ సంచలన మార్పులు.. క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!

IND vs PAK: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రపంచ క్రికెట్ అభిమానులకు సరికొత్త మజాను అందించేందుకు సిద్ధమైంది. ఎడిన్‌బర్గ్‌లో ముగిసిన వార్షిక సమావేశంలో, ఐసీసీ బోర్డు రెండు మెగా టోర్నమెంట్ల ఫార్మాట్లలో విప్లవాత్మక మార్పులను అధికారికంగా ప్రకటించింది. టోర్నీ ప్రారంభ దశ నుంచే ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 2027లో జరగబోయే పురుషుల వన్డే ప్రపంచకప్‌తో పాటు 2028లో జరిగే టీ20 ప్రపంచకప్‌ల కొత్త రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..   
  
2027 వన్డే ప్రపంచకప్: 
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల సంయుక్త ఆతిథ్యంలో 2027లో జరగనున్న వన్డే ప్రపంచకప్ 14 జట్లతోనే జరగనుంది. కానీ, ఈసారి టోర్నీ కేవలం గ్రూప్ మ్యాచ్‌లతో కాకుండా సరికొత్త నాలుగు దశల ఫార్మాట్‌లో సాగనుంది. 

* మొదటి దశ (సూపర్ సిరీస్): అర్హత సాధించిన 14 జట్లలో అత్యంత తక్కువ ర్యాంకింగ్ కలిగిన చివరి 3 జట్లు మొదట సూపర్ సిరీస్ రౌండ్ -రాబిన్ లీగ్‌లో తలపడతాయి. వీటిలో కేవలం ఒకే ఒక జట్టు తదుపరి గ్రూప్ దశకు అర్హత సాధిస్తుంది, మిగిలిన రెండు జట్లు టోర్నీ ప్రారంభంలోనే వెనుదిరుగుతాయి.  

* రెండో దశ (గ్రూప్ స్టేజ్): మిగిలిన 12 జట్లను రెండు గ్రూపులుగా (ఒక్కో గ్రూప్‌లో 6 జట్లు) విభజిస్తారు. లీగ్ మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత.. ప్రతి గ్రూప్ నుంచి టాప్–3 స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు రెండు గ్రూపుల్లో కలిపి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఒకే ఒక్క నాలుగో స్థాన జట్టు (మొత్తం 7 జట్లు) సూపర్ 7 దశకు చేరుకుంటాయి.  

* మూడో దశ (సూపర్ 7): ఈ 7 జట్ల మధ్య రౌండ్-రాబిన్ పద్ధతిలో 21 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

* నాలుగో దశ (నాకౌట్స్): సెమీఫైనల్స్ లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలోని జట్టుతో, రెండో స్థానంలో ఉన్న జట్టు మూడో ప్లేస్ లోని టీమ్ తో తలపడతాయి. విజేతలు ఫైనల్స్‌లో తలపడి ట్రోఫీ కోసం పోరాడతారు.  

భారత్– పాక్ పోరు.. ఒకే టోర్నీలో రెండుసార్లు ఫైట్:
క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ ఉన్న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ల విషయంలో ఈ కొత్త ఫార్మాట్ అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనుంది. ఈ కొత్త నియమాల ప్రకారం భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉంటే గనుక.. ఈ మెగా టోర్నీలో కనీసం రెండుసార్లు తలపడే అవకాశం లభిస్తుంది. మొదట గ్రూప్ దశలో ఒకసారి ముఖాముఖి పోరాడగా, ఆ తర్వాత ఇరు జట్లు క్వాలిఫై అయి సూపర్ 7 దశకు చేరితే అక్కడ రెండోసారి తలపడే లక్కీ ఛాన్స్ దక్కుతుంది.

►ALSO READ | ముంబై ఇండియన్స్‌లో బిగ్ ట్విస్ట్.. కొత్త కెప్టెన్‌గా తిలక్ వర్మ 

2028 టీ20 ప్రపంచకప్:  
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వనున్న 2028 టీ20 ప్రపంచకప్ కూడా 20 జట్లతోనే కొనసాగినప్పటికీ, దీని ఫార్మాట్‌లో ఉత్కంఠను రెట్టింపు చేసేలా మార్పులు చేశారు. 

* గ్రూప్ దశ: గతంలో నాలుగు గ్రూపులుగా ఉన్న 20 జట్లను, ఇప్పుడు ఐదు గ్రూపులుగా (గ్రూప్‌నకు 4 జట్లు చొప్పున) విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు (మొత్తం 10 జట్లు) సూపర్ 10 దశకు చేరుకుంటాయి.

* సూపర్ 10: ఈ 10 జట్లను రెండు గ్రూపులుగా (గ్రూప్‌నకు 5 చొప్పున) విభజిస్తారు. ఈ రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో (1వ స్థానం) నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

* ఎలిమినేటర్స్: మిగిలిన రెండు సెమీఫైనల్ స్థానాల కోసం సరికొత్తగా ఎలిమినేటర్స్ రౌండ్ ప్రవేశ పెట్టారు. ఒక గ్రూప్‌లోని రెండో స్థానంలోని జట్టు, మరో గ్రూప్‌లోని మూడో ప్లేస్ లోని టీమ్ తో తలపడుతుంది. వీటిలో విజేతలుగా నిలిచిన రెండు జట్లు మిగిలిన రెండు సెమీఫైనల్ స్థానాలను భర్తీ చేస్తాయి. ఆ తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. కాగా ఐసీసీ తీసుకున్న ఈ సమూల మార్పులు టోర్నీ ప్రారంభం నుంచే ప్రతి ఒక్క మ్యాచ్‌ను చావో రేవో తేల్చుకునేలా చేసి, ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడం ఖాయంగా కనిపిస్తోంది.