ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైసీపీ అధినేత జగన్

ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైసీపీ అధినేత జగన్

కిర్లంపూడి: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంతిమ యాత్ర మొదలైంది. ఆయన అంత్యక్రియలకు హాజరైన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్.. ముద్రగడ పాడె మోశారు. పద్మనాభం ఇంటి ఆవరణలోనే.. ఆయన ఇంటికి వంద మీటర్ల దూరంలోనే ఖననం చేయనున్నారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ కిర్లంపూడిలోనే ఉండాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు.

జగన్తో పాటు మాజీ మంత్రి బొత్స కూడా ముద్రగడ పద్మనాభం పాడె మోశారు. కొన్ని నెలల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ.. హైదరాబాద్ సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ముద్రగడ చనిపోయారు. 

ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న జన్మించారు. ఆయన సొంతూరు తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి. ఏపీకి చెందిన సీనియర్ రాజకీయ నాయకుల్లో ముద్రగడ పద్మనాభం ఒకరు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 

రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. ఒక పర్యాయం కాకినాడ నుంచి ఎంపీగా సేవలందించారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి కేబినెట్లలో మంత్రిగా చేశారు. ముద్రగడకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ముద్రగడ పద్మనాభం వయసు 73 సంవత్సరాలు. ముద్రగడ కొంతకాలం వైసీపీలో కీలకంగా వ్యవహరించారు.