'రా ఎన్టీఆర్' ( Raw NTR ) ఫ్యాన్స్ పేరుతో సోషల్ మీడియాలో జోరుగు ప్రచారం జరుగుతున్న కార్యక్రమానికి హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ అభిమానులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని హెచ్చరించారు.
తిరుపతికి రావద్దు..
ఈ నెల 18న తిరుపతిలోని తాజ్ వేదికగా 'ఉరువాడ' పేరుతో రూ.100 కోట్లతో భారీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని కృష్ణ యాదవ్ తెలిపారు. ఈ ప్రచారాన్ని నమ్మి అభిమానులు ఎవరూ మోసపోవద్దని, తిరుపతికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
'రా ఎన్టీఆర్' పై ఎస్పీకి ఫిర్యాదు..
ఈ 'రా ఎన్టీఆర్' అంశంపై ఇప్పటికే తిరుపతి అదనపు ఎస్పీకి వినతిపత్రం అందజేసినట్లు కృష్ణ యాదవ్ వెల్లడించారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించి, చట్టవిరుద్ధంగా, అభిమానులను తప్పుదోవ పట్టించేలా కార్యక్రమం నిర్వహించే ప్రయత్నాలు ఉంటే వాటిని అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారం వచ్చినప్పుడే స్పందించాలని కృష్ణ యాదవ్ సూచించారు. తారక్ పేరు, అభిమానుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే వారిపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
►ALSO READ | Aamir Khan Marriage: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై ఫత్వా జారీ.. గౌరీ స్ప్రాట్‌తో వివాహంపై ముఫ్తీ తీవ్ర అభ్యంతరం!
'ఉరువాడ' ఆగదు..
ఎన్టీఆర్‌పై అభిమానులు చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు కృష్ణ యాదవ్. మరో వైపు మేము మా సొంత డబ్బులతో సేవ చేస్తుంటే సమస్యలు సృష్టిస్తున్నారని రా ఎన్టీఆర్ ఫౌండర్ సాయి రూప్ అన్నారు. నేను ఏంటో హీరోకి తెలుసు. ఎవరు ఏం అనుకున్నా ఈ 'ఉరువాడ' కార్యక్రమం ఆగదని పేర్కొన్నారు. మరి ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
