బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ మూడో పెళ్లి మరో సారి హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల తన చిరకాల స్నేహితురాలు గౌరీ స్ప్రాట్ ను వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ పెళ్లి మతపరమైన వివాదానికి కేంద్రబిందుగా మారింది. ఈ మతాంతర వివాహంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తాకు చెందిన షాహీ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్సేన్ ఆయనపై ఫత్వా జారీ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మతాంతర వివాహం చెల్లదు..
గౌరీ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి కాకపోవడంతో ఈ వివాహం షరియా నిబంధనలకు విరుద్ధమని ముఫ్తీ అభిప్రాయపడ్డారు. ఒక ముస్లిం పురుషుడు ఇస్లాం మతాన్ని స్వీకరించని అన్యమత స్త్రీని వివాహం చేసుకోవడం నిషిద్ధమన్నారు. ముస్లిం పురుషుడు ముస్లిమేతర మహిళను వివాహం చేసుకోవడం హరామ్. ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించిన తర్వాత మాత్రమే అలాంటి వివాహం సమ్మతించదగినది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పదే పదే పెళ్లిళ్లు చేసుకోవడం సరికాదు..
అంతేకాకుండా..ఆమిర్ ఖాన్ వరుస పెళ్లిళ్లు, విడాకులపై కూడా ముఫ్తీ ఘాటుగా స్పందించారు. వివాహ బంధానికి సంబంధించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకుండా పలుమార్లు పెళ్లిళ్లు చేసుకోవడం సమర్థనీయం కాదని, అలాంటి నిర్ణయాలకు ప్రతి వ్యక్తి దేవుడి ముందు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. అమీర్ వివాహంపై ఇప్పటికే పలుచోట్ల నిరసనలు కూడా వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు.
అయితే ఈ వివాదంపై అమీర్ ఖాన్ గానీ, ఆయన బృందం గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అమీర్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకోగా వారికి జునైద్, ఐరా అనే ఇద్దరు సంతానం ఉన్నారు. అనంతరం 2005లో దర్శకురాలు కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వారికి సరోగసీ ద్వారా ఆజాద్ జన్మించాడు. 2021లో విడిపోయినప్పటికీ ఇద్దరూ కలిసి కుమారుడి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించిన అమీర్ చుట్టూ నెలకొన్న ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
