తెలంగాణలో SIR గడువు పొడిగించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి

తెలంగాణలో SIR గడువు పొడిగించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి

హైదరాబాద్: ఓటు లేకపోతే ప్రభుత్వ స్కీమ్స్ రావనే చర్చ జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. తెలంగాణలో SIR గడువు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని.. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్ ,నవీన్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్, మోత రోహిత్, రాజేష్ టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్, ఇతర ముఖ్య నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా.. హైదరాబాద్ జిల్లాలో 15 శాసన సభ నియోజకవర్గాల్లో ఓటరు సవరణ ప్రక్రియ నత్తనడకన  సాగుతుందని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో సగటున 21 శాతం ఓటరు సవరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. 10 రోజులు  సమయం మాత్రమే ఉందని, దానిని పొడిగించాలని కోరామని మీడియాకు వెల్లడించారు.

►ALSO READ | రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి : గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ జిల్లా మంత్రిగా తాను, తమ ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు.. ఎన్నికల కమిషన్ను కలిసి విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా 4వేల 500 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, అర్బన్లో ఓటరు సవరణ సరిగా జరగడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 

హైదరాబాద్లో విద్యార్థుల భాగస్వామ్యం తీసుకోవాలని కోరామని మంత్రి తెలిపారు. BLOలు ఇళ్లకి రావడం లేదని, ఫారంలు సరిగా ఇవ్వడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఎల్వోలకు ఎలాంటి సమస్య లేకుండా వారి పేమెంట్ కూడా చేశారని మంత్రి వివరించారు.