ప్రపంచ టెక్ రంగంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్, ChatGPTని అభివృద్ధి చేసిన OpenAIపై కార్పొరేట్ గూఢచర్యం ఆరోపణలు చేస్తూ 41 పేజీలతో కూడిన కేసు దాఖలు చేసింది. ఆపిల్ మాజీ ఉద్యోగులను ఉపయోగించి కంపెనీకి చెందిన అత్యంత విలువైన వ్యాపార రహస్యాలు, సాంకేతిక సమాచారాన్ని అక్రమంగా ఏఐ కంపెనీ సేకరిస్తోందని ఆరోపించింది.
ఈ కేసులో ఆపిల్ మాజీ ఉద్యోగులు టాంగ్ యూ టాన్, చాంగ్ లియూ ప్రధాన పాత్ర పోషించారని కంపెనీ పేర్కొంది. చాంగ్ లియూ కంపెనీ ల్యాప్‌టాప్‌ను తిరిగి ఇవ్వకుండా ఉంచడమే కాకుండా, అంతర్గత నెట్‌వర్క్‌లోని భద్రతా లోపాన్ని ఉపయోగించి సీక్రెట్ డేటాను యాక్సెస్ చేశాడని ఆపిల్ అంటోంది. ఇంకా మార్కెట్లో విడుదల కాని ఉత్పత్తుల డిజైన్లు, ఇంజినీరింగ్ ప్రజెంటేషన్లు సహా అనేక రహస్య ఫైళ్లను డౌన్‌లోడ్ చేసినట్లు కేసులో పేర్కొంది.
అలాగే ఆపిల్ మాజీ డిజైన్ హెడ్ టాంగ్ యూ టాన్ కూడా OpenAIలో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు వచ్చే అభ్యర్థుల ద్వారా ఆపిల్ లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి సమాచారం సేకరించే ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్వ్యూకు వచ్చే వారికి CAD డిజైన్లు, ప్రోటోటైపులు, సప్లయర్ల వివరాలు తీసుకురావాలని కోరినట్లు ఆపిల్ ఆరోపిస్తోంది.
►ALSO READ | మన కోసం రూపాయల్లో పెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసిన AI దిగ్గజం ఆంత్రోపిక్.. స్పెషల్ ఏంటంటే..?
ఇది వ్యక్తిగత స్థాయిలో జరిగిన చర్య కాదని, సంస్థాగత స్థాయిలో సమన్వయంతో జరిగిన వ్యవహారమని ఆపిల్ తన పిటిషన్‌లో పేర్కొంది. అంతేకాకుండా ఆపిల్ నుంచి అనుమతి ఉన్నట్లు చెప్పి వివిధ కంపెనీ సప్లయర్లను సంప్రదించి తయారీ సాంకేతికతకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు OpenAI ప్రయత్నించిందని పేర్కొంది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే.. 2024లో Apple–OpenAI భాగస్వామ్యం కుదిరి ChatGPTని Siriలో అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. అయితే 2026 ప్రారంభంలో ఆపిల్.. గూగుల్ జెమినీ వైపు మొగ్గుచూపింది. ఆ తర్వాత రెండు కంపెనీల మధ్య విభేదాలు మరింత తీవ్రతరం అయ్యాయి. అయితే ఈ ఆరోపణలను ఓపెన్ ఏఐ ఖండించింది. ఇతర కంపెనీల వ్యాపార రహస్యాలపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని, కేసును పూర్తిగా పరిశీలిస్తున్నామని సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడే AI సాంకేతికత అభివృద్ధిపైనే తమ ఫోకస్ కొనసాగుతుందని ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది.
