AI రంగంలో వేగంగా ఎదుగుతున్న కంపెనీ ఆంత్రోపిక్ భారతీయ యూజర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు Claude AI పెయిడ్ ప్లాన్‌ల కోసం అమెరికన్ డాలర్లలో చెల్లించాల్సి వచ్చేది. దీంతో కరెన్సీ మార్పిడి ఛార్జీలు, 18 శాతం GST, అంతర్జాతీయ ట్రాన్సాక్షన్ ఫీజులు కలిపి వినియోగదారులపై అదనపు భారం పడేది. ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పెడుతూ కంపెనీ భారత్‌లో రూపాయి కరెన్సీలోనే ప్లాన్స్ తీసుకొచ్చింది.
ఇకపై భారతీయ వినియోగదారులు నేరుగా రూపాయల్లోనే Claude AI సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. దీంతో డాలర్లలో చెల్లించాల్సిన అవసరం లేకుండా సులభంగా ప్లాన్‌లను తీసుకోవచ్చు. Claude Pro ప్లాన్ ధర నెలకు రూ.2వేలుగా నిర్ణయించారు. Claude Max ప్లాన్ రూ.11వేల 999 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే వ్యాపార సంస్థల కోసం అందించే Claude Team ప్లాన్ ఒక్కో యూజర్‌కు నెలకు రూ.2వేల 399గా ఉంది. విశేషం ఏంటంటే ఈ రేట్లు జీఎస్టీతో పాటు ఇతర ఛార్జీలతో కలిపి బండిల్ చేయటమే. అంటే ప్లాన్ ధరపై అదనంగా ఎలాంటి ఛార్జీలు కట్టక్కర్లేదన్నమాట.
►ALSO READ | ఉద్యోగం మారారా? పీఎఫ్ బదిలీ వెంటనే జరగదు... మారిన EPFO రూల్స్ తెలుసా..?
Claude Pro ప్లాన్‌లో ఉచిత వెర్షన్‌తో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ వినియోగ పరిమితి లభిస్తుంది. అలాగే Sonnet 5, Opus, Fable 5 వంటి అధునాతన AI మోడళ్లకు యాక్సెస్, Research Mode, Web Search, Memory, Unlimited Projects, Claude Code వంటి ప్రీమియం ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. Max ప్లాన్‌లలో మరింత ఎక్కువ వినియోగ పరిమితులు, అదనపు AI టూల్స్ అందిస్తారు.
భారత్ ప్రస్తుతం అమెరికా తర్వాత క్లాడ్ కు రెండో అతిపెద్ద మార్కెట్‌గా మారింది. దీనివల్ల కంపెనీ భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల బెంగళూరులో కొత్త కార్యాలయం ప్రారంభించడంతో పాటు ఇన్ఫోసిస్, TCS లాంటి ప్రముఖ ఐటీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఇరీనా ఘోష్‌ను భారత కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. మెుత్తానికి రూపాయల్లో ప్లాన్లను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ యూజర్లకు Claude AI మరింత చేరువ కానుంది.
