న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోం శాఖ నుంచి కీలక గుర్తింపు లభించింది. భోగాపురం ఎయిర్పోర్ట్ను ఇమ్మిగ్రేషన్, విదేశీయుల చట్టం, 2025 పరిధిలోకి తీసుకొస్తున్నట్లు హోం శాఖ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం (జులై 13) కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి నితేష్ కుమార్ వ్యాస్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో దేశంలోని కేటగిరీ-1 విమానాశ్రయాల జాబితాలో 39వ స్థానంలో చేరింది. ఈ గుర్తింపుతో భోగాపురం నుంచి నేరుగా అంతర్జాతీయ విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉత్తరాంధ్ర ప్రాంతం మరింత వేగంగా వృద్ధి చెందనుంది.
