- ఎల్ నినో దెబ్బతో సగానికి పడిపోనున్న వరి విస్తీర్ణం
- నీటి కష్టాలతో వాణిజ్య పంటల వైపు మళ్లుతున్న రైతులు
- ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తున్న అగ్రికల్చర్ ఆఫీసర్లు
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు చిత్రం మారుతోంది. ఎప్పుడూ వరితో కళకళలాడే పొలాలు ఈసారి భిన్నంగా కనిపించబోతున్నాయి. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవకపోవడం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. వరి సాగుకు గుడ్ బై చెప్పి.. తక్కువ నీటితో పండే పత్తి, మిరప సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
సగానికి పడిపోనున్న వరి..
గత కొన్నేండ్లుగా రికార్డు స్థాయిలో వరి పండించిన నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈసారి పరిస్థితి తలకిందులైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు అంటే వరి అన్నట్లుగా పరిస్థితి ఉంది. అన్ని పంటలు కలిపి 22.10 లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్టు అధికారులు అంచనా. ఇందులో ఒక్క వరి మాత్రమే 11 లక్షల ఎకరాలకు పైగా సాగవుతుంది. ప్రతి సీజన్లోనూ ధాన్యం 30 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తుంది. దీని తర్వాత పత్తి 7 లక్షల ఎకరాలకుపైగా సాగు చేస్తుండగా, మిగతా 2 నుంచి 3 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు కంది, పెసర, మినుములు, మిర్చి, జొన్నలు, కూరగాయలు, పండ్ల తోటలు వంటివి సాగు చేస్తారు.
30 వేల ఎకరాలకు పడిపోయిన ‘బత్తాయి’
ఉమ్మడి జిల్లాకే మంచి గుర్తింపు తెచ్చిన బత్తాయి సాగు పూర్తిగా తగ్గిపోయింది. ఐదారేండ్ల కింద 1.50 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు చేయగా, ప్రస్తుతానికి 30వేల ఎకరాలకు చేరింది. నిమ్మ తోటల పరిస్థితి దాదాపు అంతే. అసలే ఈసారి కరువు పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తుండగా, మళ్లీ వరి పంటనే నమ్ముకుంటే నష్టపోతామని రైతులు భావిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరి సాగు విస్తీర్ణం ఈసారి సగానికి పడిపోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోవడం, నాగార్జున సాగర్, మూసి వంటి ప్రాజెక్టుల కింద నీటి విడుదలపై స్పష్టత లేకపోవడంతో రైతులు వరి జోలికి వెళ్లడం లేదు.
పత్తి, మిరప సాగుపై దృష్టి
వరి తర్వాత పత్తి, మిరప పంటలకు డిమాండ్ ఉండటం, తక్కువ నీటితో సాగు చేసే అవకాశం ఉండటంతో వీటి వైపు ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతున్నారు. గత ఖరీఫ్ సీజన్ లో సూర్యాపేట జిల్లాలో 9లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈసారి ఇప్పటివరకు 74,701 ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటగా, నల్గొండ జిల్లాలో మాత్రం 5.57 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. ఇప్పటికే నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో, సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, హుజూర్‌నగర్ బెల్టులో పత్తి విత్తనాలు నాటేందుకు రైతులు సిద్ధమయ్యారు. మిరప నారు మడులు కూడా ముమ్మరంగా పోస్తున్నారు. మరోవైపు ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా వర్షాలు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేసి రిస్క్ తీసుకోవద్దని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆరుతడి పంటలు పండించాలని పలు సూచనలు చేస్తున్నారు.
