- ఫైనాన్షియల్ సర్వీసెస్, డేటా సెంటర్లు, క్లౌడ్‌పై ఫోకస్
- ఇందుకోసం భారీగా ఇన్వెస్ట్ చేస్తామని ఎయిర్‌టెల్ చైర్మన్
- సునీల్ మిట్టల్ ప్రకటన
న్యూఢిల్లీ: ఇక నుంచి ఫైనాన్షియల్ సర్వీసెస్, డేటా సెంటర్లు, క్లౌడ్ బిజినెస్‌లపై ఫోకస్ పెంచుతామని భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ కంపెనీ యాన్యువల్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. గత పదేళ్లలో డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం రూ. 3.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టామని, ఎయిర్‌టెల్ సబ్సిడరీ ఎయిర్‌టెల్ మనీలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడి పెడతామని తెలిపారు.
‘‘ డిపాజిట్లు స్వీకరించని ఎన్‌బీఎఫ్‌సీగా పనిచేయడానికి ఆర్‌బీఐ నుంచి ఎయిర్‌టెల్ మనీకి అనుమతి లభించింది. మరో సబ్సిడరీ నెక్స్‌ట్రా డేటా సెంటర్స్ 1 గిగావాట్ (జీడబ్ల్యూ) కెపాసిటీని నిర్మించే పనిలో ఉంది. ఇటీవల 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,500 కోట్ల) ను సేకరించింది. క్లౌడ్, ఏఐ ఆధారిత డేటా సెంటర్స్ పెట్టుబడులపై ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇవ్వడం కలిసిరానుంది.
ఎయిర్‌టెల్ క్లౌడ్‌తో దేశీయంగానే డేటాను భద్రపరచొచ్చు. ఇప్పటికే క్లౌడ్ సేవల కోసం కంపెనీ 24 కి పైగా డీల్స్ కుదుర్చుకున్నాం”అని మిట్టల్ వివరించారు. ఎయిర్‌టెల్ 5జీ కస్టమర్ల సంఖ్య 18.8 కోట్లకు (188 మిలియన్లు) చేరిందని తెలిపారు.
