నేరెళ్ల బాధిత కుటుంబాలకు.. రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి: ఇబ్రాం శేఖర్

నేరెళ్ల బాధిత కుటుంబాలకు.. రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి: ఇబ్రాం శేఖర్

హైదరాబాద్, వెలుగు: నేరెళ్ల దళితులపై దాడి జరిగి పదేండ్లు కావొస్తున్నా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఇబ్రాం శేఖర్ మండిపడ్డారు. నేరెళ్ల బాధితుల్లో ఒకరైన  గంధం గోపాల్ అకాల మరణం బాధాకరమన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. గంధం గోపాల్ కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిగతా బాధితుల కుటుంబాలకు కూడా తగిన ఆర్థిక సహాయం అందించి, వారిలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.

ఇసుక దందాను అడ్డుకుంటున్నారనే అక్కసుతో 2017, జులైలో ఎనిమిది మంది దళితులపై పాశవికంగా దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసమే ఈ దాడులు జరిగాయని కల్వకుంట్ల కవిత బహిరంగంగానే చెప్పారని గుర్తుచేశారు. నేటికీ బాధితులు ఏ పనీ చేసుకోలేక తీవ్ర శారీరక, మానసిక క్షోభను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని శేఖర్ గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.