హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ విమర్శించారు. ఆదివారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నిస్తోందన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్లు నిల్వ చేస్తే బ్యారేజీలు కూలిపోతాయని చెబితే, మళ్లీ నీళ్లు నింపమని అడగడం హాస్యాస్పదమన్నారు.
సీఎం, మంత్రులు మ్యాప్‌లతో సహా వివరణ ఇచ్చినా బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడం లేదని చెప్పారు. కన్నెపల్లి పంప్ హౌస్‌ను నీటి నిల్వ లేని చోట ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజినీర్లు చెప్పిన ప్రాథమిక సూచనలను ఎందుకు పాటించలేదన్నారు. ఎన్డీఎస్ఏ నివేదికను పక్కన పెట్టి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం హరీశ్ రావు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తొమ్మిదేండ్లలో చేయలేని పనిని, కేవలం మూడు నెలల్లో చేస్తానని హరీశ్‌రావు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
