Gautam Gambhir: భారత జట్టు ఓటముల పరంపర కొనసాగుతున్న వేళ తెరవెనుక మరో పెద్ద సంక్షోభం స్టార్ట్ అయింది. ఐర్లాండ్ చేతిలో 2–0తో, ఇంగ్లాండ్ చేతిలో 4–0 తేడాతో టీ20 సిరీస్‌లను ఘోరంగా ఓడిపోవడంతో.. ఇండియా కోచింగ్ స్టాఫ్‌లో అనిశ్చితి నెలకొంది. జట్టు ప్రదర్శనపై బీసీసీఐ (BCCI) త్వరలోనే రివ్యూ మీటింగ్ నిర్వహించనుండగా, ఆలోపే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు బిగ్ షాక్ తగిలింది. గంభీర్ కి ఎంతో నమ్మకంగా జట్టులోకి తీసుకున్న సపోర్ట్ స్టాఫ్లోని ఇద్దరు తప్పుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుత ఇంగ్లాండ్ టూర్ ముగిసిన వెంటనే అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాట్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ భారత్‌ను వీడబోతున్నట్లు తెలుస్తుంది.
భారత్ని వీడి ఐపీఎల్‌లోకి:
గత 2024లో గౌతమ్ గంభీర్ భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు, ఈ ఇద్దరు కోచ్‌లు జట్టులో జాయిన్ అయ్యారు. ఇండియన్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలను బలోపేతం చేయడం కోసం గంభీర్ స్వయంగా వీరిద్దరిని తుది జట్టులోకి తీసుకున్నాడు. కానీ, ర్యాన్ టెన్ డోస్కాట్ టీమిండియాతో కొనసాగడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు.. ఏడాది పాటు జట్టుతో కలిసి ప్రయాణించిన తనకు ఇబ్బందిగా మారిందని ఆయన బీసీసీఐకి తెలిపినట్లు టాక్. దీనికి తోడు ఆయన ఒక ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీతో కోచింగ్ పదవి కోసం చర్చలు జరుపుతున్నట్లు వార్త కథనాలు నడుస్తున్నాయి. మరోవైపు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా వన్డే సిరీస్ ముగిసిన తర్వాత తన భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
జింబాబ్వే టూర్‌కు గంభీర్ ఔట్:
ఇంగ్లండ్ టూర్ ముగిసిన వెంటనే ఇండియన్ టీమ్ జూలై 2026 చివరి వారంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అక్కడ జింబాబ్వేతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. జూలై 23న మొదటి టీ20, జూలై 25న రెండో మ్యాచ్, జూలై 26న మూడో మ్యాచ్ జరగనున్నాయి. కానీ, ఈ జింబాబ్వే పర్యటనకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ని బీసీసీఐ తప్పించింది. అతడికి రెస్ట్ ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. గంభీర్ స్థానంలో నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ టూర్ కి తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
శ్రీలంక టూర్ కి కొత్త బౌలింగ్ కోచ్:
ఒకవేళ మోర్నీ మోర్కెల్, ర్యాన్ టెన్ డోస్కాట్ ఇద్దరూ జట్టు నుంచి తప్పుకోవాలని ఫిక్స్ అయితే, బీసీసీఐ చాలా వేగంగా స్పందించాల్సి ఉంది. ఎందుకంటే ఆ వెంటనే శ్రీలంక పర్యటనకు టీమిండియా వెళ్లబోతుంది. ఆగస్టు 2026లో జరగబోయే ఈ శ్రీలంక టూర్ లో ఇండియా రెండు టెస్టుల సిరీస్ ఆడబోతుంది. ఆగస్టు 15వ తేదీన గాలే వేదికగా మొదటి టెస్ట్, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్ట్ జరగనున్నాయి. మోర్కెల్ లేకపోతే, ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉన్న టీమిండియా మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీని శ్రీలంక టూర్‌కు తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా పంపడానికి బీసీసీఐ యోచిస్తుంది.
ఫీల్డింగ్ కోచ్ టీ.దిలీప్‌పైనా వేటు?
భారత్ వరుస పరాజయాలతో కేవలం అసిస్టెంట్, బౌలింగ్ కోచ్‌లు మాత్రమే కాదు, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ పోస్టుపై కూడా కత్తి వేలాడుతుంది. గత కొంతకాలంగా ఇండియన్ టీమ్ ఫీల్డింగ్ ప్రమాణాలు భారీగా పడిపోవడంతో.. బోర్డు ఆయనపై కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద గంభీర్ కోచింగ్ టీమ్‌లోని సభ్యులు తప్పుకోవడానికి రెడీ కావడం, మరికొందరిపై బీసీసీఐ వేటు వేసేందుకు సిద్ధమైంది. రాబోయే రోజుల్లో టీమిండియా సపోర్ట్ స్టాఫ్ పూర్తిగా మారిపోయే ఛాన్స్ కనిపిస్తున్నాయి.
