యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలతో తన సేవా ప్రస్థానాన్ని ప్రారంభించింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన తొలి అధికారిక సమావేశంలో... ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం 5 ప్రధాన అజెండా అంశాలకు బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా తమకు లక్ష్మీనరసింహుని సేవలో భాగస్వామ్యం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, దేవాదాయ శాఖ మంత్రికి, తెలంగాణ ప్రభుత్వానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు.
యాదగిరిగుట్టను ప్రపంచ ప్రఖ్యాత దివ్యక్షేత్రంగా, దేశంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని బోర్డు స్పష్టం చేసింది. ఇందుకోసం భక్తులు, పీఠాధిపతులు, మఠాలు, దాతలతో పాటు ప్రవాస భారతీయుల (NRIs) సహకారాన్ని కూడా తీసుకోనున్నట్లు ప్రకటించింది. స్వామివారి నిత్య, నైమిత్తిక, వార్షిక ఉత్సవాలను పాంచరాత్ర ఆగమ శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా... అత్యంత వైభవంగా, శాస్త్రబద్ధంగా నిర్వహిస్తామని నూతన బోర్డు సంకల్పించింది.
ముఖ్యంగా సామాన్య భక్తుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా చూస్తామని బోర్డు హామీ ఇచ్చింది. విశిష్ట అతిథులకు ఇచ్చే గౌరవంతో పాటు సామాన్య భక్తుల దర్శన ప్రాధాన్యతకు నడుమ సమతుల్యత పాటిస్తూ... సరికొత్త ఆదర్శ దర్శన వ్యవస్థను అందుబాటులోకి తేనున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, క్రమశిక్షణ, అంకితభావం, భగవద్భక్తితో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ యాదద్రి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తామని నూతన ట్రస్ట్ బోర్డు ధీమా వ్యక్తం చేసింది.
