ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఉద్యోగాల కోసం చూస్తున్నోళ్లకు గుడ్ న్యూస్

ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఉద్యోగాల కోసం చూస్తున్నోళ్లకు గుడ్ న్యూస్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు హెటెరో సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. 300 మందికి పైగా ఇంటర్‌ అర్హత ఉన్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఇంటర్‌ విద్యాశాఖ సహకారంతో హెటెరో సంస్థ ఈ నియామకాలు చేపట్టనుంది.

సంస్థకు చెందిన తయారీ కేంద్రాల్లో ప్రొడక్షన్‌, క్వాలిటీ కంట్రోల్‌ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ విషయంపై శుక్రవారం ఇంటర్‌ విద్యాశాఖ డైరెక్టర్‌ అభిలాష అభినవ్‌తో హెటెరో ప్రతినిధులు వెంకటజయపాల్‌రెడ్డి, అల్లా శ్రీనివాస్‌, మాధురి సమావేశమయ్యారు.

ఇంటర్‌ చదివిన అభ్యర్థులకు ఉద్యోగంతో పాటు అవసరమైన శిక్షణ కూడా ఇచ్చి విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే జాబ్‌ మేళాల ద్వారా 70 మందిని ఎంపిక చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఇకపై ఈ సంఖ్యను 300 దాటించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్రంలోని స్థానిక ప్రతిభను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అభిలాష అభినవ్‌ తెలిపారు.