ప్లాన్ ఎల్‌‌నినో...! వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా ఎదుర్కొనేందుకు సర్కార్ నిర్ణయం...

ప్లాన్ ఎల్‌‌నినో...! వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా ఎదుర్కొనేందుకు సర్కార్ నిర్ణయం...
  • తక్కువ నీరు, తక్కువ వ్యవధి ఉన్న పంటల సాగుకు ప్రాధాన్యం
  • జిల్లాల వారీగా పంటల ఎంపికకు కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు
  • ఐసీఏఆర్–క్రిడా సహకారంతో వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం

హైదరాబాద్, వెలుగు: ఎల్‌‌నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయించింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున తక్కువ నీటి వినియోగం, తక్కువ కాలంలో పండే పంటలను ఎంపిక చేసే బాధ్యత కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కమిటీలకు ఇవ్వనున్నారు. 

ఈ కమిటీల్లో వ్యవసాయ, హార్టికల్చర్‌‌‌‌, నీటిపారుదల, వాతావరణ శాఖల అధికారులుంటారు. ఎల్‌‌నినో పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుస రివ్యూలు చేస్తూ..  జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

మూడు దశల్లో కార్యాచరణ 

వాతావరణ శాఖ లెక్కల ఆధారంగా జులై 15, 30, ఆగస్టు 15 నాటికి నమోదయ్యే వర్షపాతం అంచనాల మేరకు మూడు దశల్లో కార్యాచరణను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించడం, సాగు విధానాల్లో మార్పులు సూచించడం, నీటి లభ్యతను బట్టి ప్రాంతాల వారీగా ప్రత్యేక పంటలు సాగు చేయించడం వంటి చర్యలు చేపట్టనున్నారు.  జులై 10 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులపై  రైతు వేదికలు, గ్రామ పంచాయతీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

ఐసీఏఆర్–క్రిడా సహకారంతో యాక్షన్ ప్లాన్

భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్), క్రిడా సహకారంతో వ్యవసాయ శాఖ సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఇందులో వర్షాభావ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యవసాయ నిర్వహణ పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల సాగు, తేమ సంరక్షణ చర్యలు, విత్తనాల ఎంపిక, సాగు సమయ మార్పులు వంటి అంశాలుంటాయి.  వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జిల్లా స్థాయి అధికారులకు ఇప్పటికే ఈ అంశాలపై శిక్షణ ఇచ్చారు. 

శాఖల మధ్య సమన్వయానికి ప్రాధాన్యం

వాతావరణ, వ్యవసాయ, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐఎండీ విడుదల చేసే వర్షపాతం అంచనాలు, హెచ్చరికలు, వాతావరణ సమాచారాన్ని వేగంగా రైతులకు చేరవేయాలని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం 18 జిల్లాల్లోని సుమారు 28 లక్షల మంది రైతులకు మండలాల వారీగా వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలివేగం తదితర వివరాలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నట్టు వ్యవసాయ శాఖ తెలిపింది.

విత్తనాలు, ఎరువులపై ప్రత్యేక దృష్టి

ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సరిపడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, సహకార శాఖలు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, ఇన్‌‌పుట్లను అందించాలని సూచించింది. వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీరు అవసరమయ్యే కందులు, మునగ వంటి విత్తనాలను  రైతులకు అందిస్తోంది. 

జిల్లాల వారీగా కంటింజెన్సీ ప్రణాళిక ఇదే.. 

ఎల్‌‌నినో వాతావరణ పరిస్థితులు, ఐఎండీ అంచనాలు, తెలంగాణ ప్రభుత్వం, ఐసీఏఆర్–క్రిడా రూపొందించిన జిల్లాల వారీగా కంటింజెన్సీ ప్రణాళికల ఆధారంగా రాష్ట్రంలో తక్కువ కాలంలో పండే, తక్కువ నీటి వినియోగంతో సాగయ్యే పంటల వైపు రైతులను మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మక్కజొన్న, కందులు, పెసర, మినుములు, నువ్వులు, జొన్న, సజ్జలు వంటి స్వల్పకాలిక పంటలు.. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కంది, పెసర, మినుములు, మక్కజొన్నతో పాటు సోయాబీన్, నువ్వులు, జొన్నలు, చిరుధాన్యాలు, అవసరమైతే పత్తి విస్తీర్ణాన్ని పరిమితంగా సాగు చేయాలని సూచిస్తున్నారు. 

మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌‌నగర్, వనపర్తి, నాగర్‌‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో  వరికి బదులుగా కంది, పెసర, మినుములు, నువ్వులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు, మక్కజొన్న వంటి తక్కువ నీటి అవసరమున్న పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.

తక్కువ రోజుల్లో చేతికి వచ్చే పంటలనూ వ్యవసాయ శాఖ సూచించింది. హార్టికల్చర్​ పంటల్లో మిర్చి, పసుపు, కూరగాయలు, పండ్ల తోటల్లో డ్రిప్ సేద్యం, మల్చింగ్, తేమ సంరక్షణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం కొనసాగితే పెసర(70-–90 రోజులు), మినుములు(75–90), నువ్వులు( 85–100) , మక్కజొన్న(90–110) , జొన్న, సజ్జలు, కొర్రలు(90–120), కంది(120–150 రోజులు)  వంటి పంటలు రైతులకు అత్యంత అనుకూల ప్రత్యామ్నాయాలుగా ప్రభుత్వం గుర్తించింది.  

జిల్లాలవారీగా పంటల ప్రణాళికలు

ప్రతి జిల్లాలో వర్షపాతం, భూగర్భ జలాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, సాగునీటి లభ్యతను నిరంతరం సమీక్షించి వాటికి తగ్గట్టుగానే పంట ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించింది. వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫారసుల ఆధారంగా ఏ ప్రాంతంలో ఏ పంట అనుకూలమో రైతులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని,  రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న  నీటి నిల్వలకు తగ్గట్టుగా సాగు ప్రణాళికలు రూపొందించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. 

మహారాష్ట్ర, కర్నాటకలో వర్షాలు ప్రారంభమైన వెంటనే గోదావరి బేసిన్‌‌లోని శ్రీపాద ఎల్లంపల్లి సహా ప్రధాన జలాశయాలను నింపేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఎల్‌‌నినో ప్రభావంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని, భారత వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చే  సూచనలను పాటించాలని సూచిస్తోంది.