బషీర్‌బాగ్, వెలుగు: దేశవ్యాప్తంగా చేపట్టనున్న కులగణనలో ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ కేటాయించి జనగణన నిర్వహించాలని బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. యూనిక్ కోడ్‌లు లేకుంటే 2011 సామాజిక-ఆర్థిక కులగణనలో ఎదురైన సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశం ఉందన్నారు.
ఒకే కులం వివిధ పేర్లతో నమోదై డూప్లికేషన్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ కుల సర్వే, బీహార్ కులగణనలో అమలు చేసిన కోడ్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. కులగణన ప్రశ్నావళిలో సామా జిక, ఆర్థిక, విద్యా అంశాలకు సంబంధించిన ప్రశ్నలు చేర్చి నిపుణులతో సంప్రదింపులు జరపాలని కోరారు. ఈ సమావేశంలో పూర్ణచందర్ రావు, బాలగోని బాలరాజు, అయిలి వెంకన్న గౌడ్ పాల్గొన్నారు.
