పొగజిమ్ముతున్న వాహనాలు... ఆ వెహికల్స్ వెనుక వెళ్లాలంటేనే దడ..  సిగ్నల్స్ దగ్గర అయితే నిత్యం నరకమే

పొగజిమ్ముతున్న వాహనాలు... ఆ వెహికల్స్ వెనుక వెళ్లాలంటేనే దడ..  సిగ్నల్స్ దగ్గర అయితే నిత్యం నరకమే
  • హైదరాబాద్​ లో కాలుష్యం వెదజల్లుతున్న 10 శాతం వెహికల్స్‌‌
  • 90 లక్షల వాహనాల్లో విషం విడుదల చేస్తున్నవి 9 లక్షలు 
  • ఇందులో ఆటోలు, బైక్‌‌లే ఎక్కువ
  • 1.25 లక్షల ఆటోల్లో 15 వేలకుపైగా గడువు తీరినవే 

హైదరాబాద్​సిటీ, వెలుగు: మహానగరం హైదరాబాద్‌‌‌‌లో రోడ్డెక్కితే చాలు గుప్పు గుప్పున పొగ వదులుతూ కాలుష్యమయం చేస్తూ వెళ్లే వాహనాల సంఖ్య పెరిగిపోతున్నది. వీటి వెనకాలే వెళ్తున్న వారితోపాటు ఇతర వాహనదారులు ఆ పొగను పీలుస్తూ తమకు తెలియకుండానే శ్వాసకోశ సమస్యల బారినపడుతున్నారు. ముఖ్యంగా నగరంలో కాలం చెల్లిన ఆటోలు, టూ వీలర్లు, లారీలు, డీసీఎంలు, సరైన మెయింటెనెన్స్​లేని వాహనాలు ఈ సమస్యకు మూల కారణమవుతున్నాయి. అయితే, ఈ కాలుష్యంపై ఆర్టీఏ అధికారులు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. మరోవైపు వాహనదారులు కూడా ఇలాంటి వాహనాలు నడిపే డ్రైవర్లను ప్రశ్నించే సాహసం చేయడం లేదు. 

10 శాతం డేంజర్​ వెహికల్స్​

గ్రేటర్ హైదరాబాద్​పరిధిలో మొత్తం వాహనాలు 90 లక్షలు ఉండగా, ఇందులో 10 శాతం కాలుష్యాన్ని వెదజల్లుతున్నట్టు అధికారుల అధ్యయనంలో తేలింది. అంటే రోజూ 9 లక్షల వెయికల్స్‌‌‌‌ నగరంలో విషపు గాలిని వెదజల్లుతున్నాయి. ఈ 10 శాతం వాహనాల్లో ఎక్కువగా 15 ఏండ్లు నడిచి కాలం చెల్లినవే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో ఒక్క శాతం వాహనాలు కూడా కాలుష్య పరీక్షలు చేయించుకోవడం లేదు.  ఇవి సాధారణ వాహనాల కంటే అత్యధికంగా విషపూరిత పొగను విడుదల చేస్తున్నాయి. 

రెడ్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ పడ్డా ఇంజిన్లను ఆఫ్​ చేయట్లే

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, జంక్షన్లలో రెడ్ సిగ్నల్ పడినప్పుడు వాహనాల ఇంజన్లను ఆఫ్ చేయకపోవడం వల్ల క్లోజ్డ్ ఏరియాల్లో కార్బన్ మోనాక్సైడ్ తీవ్రత నిమిషాల్లోనే రెట్టింపు అవుతోంది. దీనివల్ల ఈ ప్రాంతాల్లో విపరీతమైన కాలుష్యం వెలువడి ఎక్కువ మంది లంగ్స్​సమస్యలకు గురవుతున్నారు. ప్రభుత్వం, ఎన్జీవోలు సిగ్నల్స్​దగ్గర ఇంజిన్​ఆఫ్​చేసి ఇంధన పొదుపుతోపాటు కాలుష్యం తగ్గడానికి సహకరించాలని విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం లేకుండా పోతున్నది. ఎప్పుడు సిగ్నల్​పడుతుందా? ఎప్పుడు దూసుకుపోదామా? అన్న తొందరలోనే వాహనదారులు ఉంటున్నారు. 

మెయింటెనెన్స్​ లేనివీ ఎక్కువే..

కాలం తీరిన వాహనాలతోపాటు నగరంలో సర్వీస్​చేయించకపోవడం,  బోర్లు, పిస్టన్లు పాడై పోయినా అలాగే నడిపిస్తుండడంతో తీవ్రమైన పొగ వెలువడుతోంది. మరికొందరు కాలం చెల్లిన వాహనాల్లో కల్తీ ఆయిల్​వాడుతున్నారు. పెట్రోల్‌‌‌‌లో డీజిల్​కలపడం..కిరోసిన్ లాంటివి మిక్స్‌‌‌‌ చేసి నడిపిస్తుండడంతో కాలుష్యం మరింత పెరుగుతోంది. ప్రతి వాహనదారుడు తరచూ పొల్యూషన్‌‌‌‌ చెకింగ్‌‌‌‌ చేసుకునేలా సిటీలో 242 పొల్యూషన్​టెస్టింగ్​స్టేషన్లను ఏర్పాటు చేశారు. 

అయితే, ఇందులో వివిధ కారణాలతో ప్రస్తుతం 159 మాత్రమే పని చేస్తున్నాయి. ఇందులోనూ ఎక్కువగా పెట్రోల్​బంకుల వద్ద, ఆర్టీఏ ఆఫీసులు, మెయిన్​రోడ్ల పక్కనే ఉన్నాయి. ఎక్కువ మందికి అందుబాటులో లేకపోవడంతో కూడా తమ వాహన కాలుష్య స్థాయిని చెక్​చేసుకోవడానికి ఎక్కువ మంది ముందుకు రావడం లేదు. ఈ స్టేషన్లలో చెక్​చేయిస్తే వాహనాలు ఏ స్థాయిలో కాలుష్యం వెదజల్లుతున్నాయో తెలుస్తుంది. సిటీలో కాలం చెల్లిన వాహనాలే ఎక్కువగా ఉండడంతో వారు ఎక్కడ తమ వాహనాల గుట్టు బయటపడుతుందోనని చెక్​చేయించుకోవడం లేదు.  

ఆటోలే ప్రమాదకరం 

సాధారణంగా15 ఏండ్లు పూర్తయిన వాహనాలకు ఫిట్‌‌‌‌నెస్​చేయించుకుని గ్రీన్​టాక్స్​చెల్లించి వాటిని నడుపుకునే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం నగరంలో 1.25 లక్షల ఆటోలు ఉండగా.. ఇందులో  దాదాపు 15 వేలకు పైగా ఆటోలు 15 ఏండ్లు దాటినవే ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన వాహనాల్లో లారీలు, ట్రక్కులు, ట్రాలీలు, బస్సులు సైతం   కాలుష్యం వెదజల్లేవి ఉన్నాయి.  

వానాకాలం పెను సవాల్​

వాహనాల కాలుష్యం ఇప్పుడు నగరవాసులకు పెను సవాల్‌‌‌‌గా మారబోతున్నది. కార్బన్ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్ తోపాటు ఇంజిన్ నుంచి వెలువడే అన్ బర్న్డ్ ఫ్యూయల్ పార్టికల్స్‌‌‌‌లాంటివి చాలా ప్రమాదకరమైనవి. వీటిని పీల్చుకోవడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇవి క్యాన్సర్లకు కూడా కారణమవుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. రోజు రోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతున్నట్టుగానే కాలుష్యం కూడా పెరుగుతోంది. 

ఇలా చేస్తే ఆట కట్టించొచ్చు 

అధిక కాలుష్యం వెదజల్లే వాహనాలను పొల్యూషన్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌తో గుర్తించి భారీ జరిమానాలు విధించాలి. నగరంలో సుమారు రూ. 10 వేల వరకు భారీ జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధించే నిబంధనలున్నా అమలుకావడం లేదు. రోడ్లపై ఉండే ట్రాఫిక్ నిఘా కెమెరాల సహాయంతో వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేసి, పీయూసీ లేని వాహనాలకు ఆటోమేటిక్‌‌‌‌గా ఈ –-చలాన్లు ఇవ్వాలి. వాహనం ఆపకుండానే, అది రోడ్డుపై వెళ్తున్నప్పుడు దాని సైలెన్సర్ నుంచి వచ్చే పొగ తీవ్రతను రోడ్డు పక్కన ఉండే రిమోట్ సెన్సింగ్ పరికరాల ద్వారా అంచనా వేసి కాలుష్య వాహనాలను గుర్తించి శిక్షలు వేయాలని ప్రజలు కోరుతున్నారు. 

తనిఖీలు చేస్తం

హైదరాబాద్‌లో కాలుష్యం వెదజల్లే వాహనాలను గుర్తించి చర్యలు తీసుకుంటాం. కాలుష్యం పెరగకుండా వాహనదారులు ఎప్పటికప్పుడు వెహికల్స్‌‌‌‌కు పొల్యూషన్​చెకప్​చేయించుకోవాలి. అందుకు తగ్గట్టుగా మేము ఆన్​లైన్​ పొల్యూషన్​ సర్టిఫికెట్​ కూడా జారీ చేస్తున్నాం. త్వరలోనే హైదరాబాద్‌లో పొల్యూషన్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌పై తనిఖీలు చేపడతాం.
- కె.వెంకటరమణ, హైదరాబాద్​ జాయింట్​ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​