షాబాద్ ఘటన: అప్పటికే ముగ్గురిని చంపేసి.. పిల్లలను చూడాలని ఉందని భార్యకు కాల్ చేసి ఇంటికెళ్లి మరో పాపం చేశాడు !

షాబాద్ ఘటన: అప్పటికే ముగ్గురిని చంపేసి.. పిల్లలను చూడాలని ఉందని భార్యకు కాల్ చేసి ఇంటికెళ్లి మరో పాపం చేశాడు !

షాబాద్: పోక్సో కేసులో బెయిల్పై బయటికొచ్చి ఆరు హత్యలకు పాల్పడిన కిరాతకుడు హత్యలు చేశాక ఎమోషనల్ డ్రామా పండించాడు. బాధిత బాలికను చెరువు దగ్గరకు తీసుకెళ్లి హత్య చేశాడు. ఆ తర్వాత ఆ బాలిక నానమ్మను, అమ్మమ్మను ఇంటికొచ్చి హత్య చేశాడు. ఈ మూడు హత్యలు చేశాక.. భార్యకు కాల్ చేసి హత్యలు చేసిన విషయం చెప్పకుండా.. కుటుంబానికి దూరమై పిల్లలపై దిగులుతో బాధపడుతున్నట్లు ఆమెను పూర్తిగా నమ్మించే ప్రయత్నం చేశాడు. పిల్లలను చూడాలని ఉందని, చూసి వెంటనే వెళ్లిపోతానని అమాయకంగా చెప్పేసరికి భార్య నిజమేనని నమ్మేసింది.

ఇంటికొస్తానని.. ఎవరికి చెప్పొద్దని భర్త భావోద్వేగంతో చెప్పేసరికి పాపం నిందితుడి భార్య.. భర్త నిజంగానే బాధపడుతున్నాడని భావించింది. పోన్లే.. ఒకసారి పిల్లలను చూసి పోతే అతనికి ఆ దు:ఖం తగ్గుతుందని ఇంటికి రమ్మని చెప్పింది. కానీ.. ఈ దుర్మార్గుడు ఇంటికొచ్చి తనను, తన పిల్లలను అత్యంత పాశవికంగా హత్య చేస్తాడని ఆమె కలలో కూడా అనుకోలేదు. ముగ్గురినీ దారుణంగా హత్య చేసి ప్రాణాలు తీస్తాడని.. తన భర్త మనిషి ముసుగులో ఉన్న మృగమని.. విచక్షణ కోల్పోయి సమాజంలో తిరుగుతున్నాడని నిందితుడి భార్య గుర్తించలేకపోయింది. భర్తను నమ్మడమే ఆమె పాలిట శాపమైంది. పిల్లలను చూసి పోతానని నిందితుడు చెప్పిన మాయ మాటలను నమ్మడమే ఆమె చేసిన పాపమైంది.

ఇంటికి వెళ్లిన నిందితుడు రాజ్ కుమార్ భార్య తలుపు తీయగానే కత్తితో దాడి చేశాడు. ఆమె పారిపోయే ప్రయత్నం చేసినా వెంటాడి కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి కన్న పిల్లలనే కనికరం లేకుండా అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను చంపేశాడు. సొంత కుటుంబాన్ని చంపేశాక గానీ ఈ క్రూర మృగం రక్త దాహం చల్లారలేదు. ఆ తర్వాత నిందితుడు అక్కడ నుంచి కారులో పరారయ్యాడు. మొత్తం ఆరు హత్యలు చేశానని.. భార్య, పిల్లలను కూడా చంపేశానని.. తాను కూడా చచ్చిపోతున్నానని నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పి మొబైల్ స్విచాఫ్ చేశాడు. రాజ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.