దేవుని సొమ్ముతో వడ్డీ వ్యాపారం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు.. అయోధ్య విరాళాల చోరీ కేసులో షాకింగ్ విషయాలు

దేవుని సొమ్ముతో వడ్డీ వ్యాపారం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు.. అయోధ్య విరాళాల చోరీ కేసులో షాకింగ్ విషయాలు

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ దర్యాప్తులో నిందితులు బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. దేవుని సొమ్మును కొట్టేసిన నిందితులు.. ఆ డబ్బుతో వ్యాపారం చేయడం విస్మయానికి గురిచేస్తోంది. అంతటితో ఆగకుండా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. 

దేశ వ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, పేదలు, మధ్యతరగతి ఇలా అన్ని రకాల వర్గాలు రెక్కల కష్టాన్ని తమ ఇష్టదైవం రాములోరికి కానుకలుగా పంపిన సొమ్ముతో దుర్మార్గులు వడ్డీ వ్యాపారం చేయడం.. కోట్లాది భక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది. కొట్టేసిన డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టగా.. మిగిలిన సొమ్మును వడ్డీలకు తిప్పుకోవడం చూస్తుంటే.. దేవుడు, పాపం, న్యాయం, ధర్మం అనే సెంటిమెంట్ లేవీ లేని కరుడుగట్టిన నేరగాళ్లకంటే ఇంకా దుర్మార్గులేమో వీళ్లు అని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. చోరీ చేసిన సొమ్ముకు సంబంధించిన ట్రాన్జాక్షన్స్ బయట పడకుండా ఉండేందుకు..  బంధువులు, సన్నిహితుల బ్యాంకు ఖాతాల ద్వారా అనేక ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు  దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

 దర్యాప్తులో భాగంగా, పోలీసులు గురువారం (జులై 09)  నిందితుడు అనుకల్ప్ మిశ్రా ఇంట్లో సుమారు 20 నిమిషాల పాటు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు అతని కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించారు. అంతకు ముందు రోజు,  మిగతా ఇద్దరు నిందితులైన లవ్‌కుష్ మిశ్రా, కరుణేష్ పాండేల ఇళ్లల్లో కూడా ఇలాంటి సోదాలు నిర్వహించారు. 

30 బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్:

రాముల వారి విరాళాల చోరీ కేసులో కీలకంగా ఉన్న ముగ్గురు నిందితుల బంధువులకు చెందిన 30 బ్యాంకు అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నిందితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో కట్టల కొద్దీ నగదు, చెవిపోగులు, లాకెట్లతో సహా బంగారు ఆభరణాలు, ఒక కారు లభించినట్లు తెలిపారు.  స్వాధీనం చేసుకున్న నగదు ఎంత అనేది  వెల్లడించలేదు. అలాగే, స్వాధీనం చేసుకున్న వస్తువులను ఎవరి ఇంటి నుంచి తీసుకున్నారనే విషయాన్ని కూడా స్పష్టం చేయలేదు.

విచారణ సమయంలో, అనుకల్ప్ మిశ్రా, అవినాష్, దొంగిలించిన విరాళాల డబ్బులో కొంత భాగాన్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినట్లు అంగీకరించారని తెలుస్తోంది.  ఆ నిధులలో కొంత భాగాన్ని వడ్డీ సంపాదించడానికి అప్పుగా ఇచ్చామని కూడా వారు దర్యాప్తు అధికారులకు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసే అంశం. 

భూమి కొనుగోలుపై అనుమానాలు:

బ్యాంకు ట్రాన్జాక్షన్స్ దాచిపెట్టే ప్రయత్నంలో, నిందితులు తమ బంధువులు , సన్నిహితులకు డబ్బు ట్రాన్స్ ఫర్ చేసి, ఆ తర్వాత తిరిగి తమ సొంత ఖాతాలకు పంపించుకున్నారని పోలీసులు చెప్పారు. అనుకల్ప్ మిశ్రా పేరు మీద ఒక ఎకరం భూమి కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.  ఆ భూమిని సుమారు రూ. 6.7 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిసింది.  

ALSO READ : అయోధ్య హుండీల్లో 10, 20 రూపాయల నోట్లే.. 

రామ మందిరంలో విరాళాల లెక్కింపు సమయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆలయ ట్రస్ట్ సిఫార్సు మేరకు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. నిధుల దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో, సిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మందిని ఇప్పటివరకు అరెస్టు చేశారు.