కోల్‌కతా: 'నా నోరు నొక్కేయాలన్నా.. టీఎంసీ పార్టీని పూర్తిగా క్లోజ్ చేయాలన్నా.. నన్ను చంపాల్సిందే' అని బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ నేతలను, కార్యకర్తలను భయపెట్టేందుకు అధికార బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శుక్రవారం ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. ‘నా నోరు నొక్కేయాలంటే.. మీరు నన్ను చంపాల్సిందే. అవును. నన్ను చంపేందుకు మీరు అన్నిరకాల ప్రయత్నాల్ని చేస్తున్నారు.
ఇప్పటికే మా పార్టీకి చెందిన మహువా, అభిషేక్, కల్యాణ్‌లపై దాడులు చేశారు. చివరికి నా ఇంటిపై కూడా దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం నా సహచరులు చాలామంది జైలు లాకప్‌ల్లో మగ్గుతున్నారు. వారిని ఒట్టి నేలపై పడుకునేలా చేశారు. కొందరిని నడుముకు తాళ్లు, కాళ్లకు బేడీలు వేసి ఊరేగిస్తున్నారు. మరి కొందరికి గుండు గీయించారు.
ఇంకొందరిపై అసహ్యకరమైన పదార్థాలను విసిరారు. ఇవన్నీ చెప్పడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. మేం కూడా 15 ఏండ్ల పాటు బెంగాల్‌లో అధికారంలో ఉన్నాం. కానీ పోలీసులను ఉపయోగించి ఇలాంటి చేష్టలకు ఎప్పుడూ పాల్పడలేదు. అయినప్పటికీ మేం ఎవరికీ భయపడం. టీఎంసీ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది’ అని పేర్కొన్నారు.
రాజకీయ ప్రతీకారాలకే ప్రాధాన్యమా?
బెంగాల్‌లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెట్టడంలేదని మమత ఆరోపించారు. పిల్లల పౌష్టికాహారం కంటే రాజకీయ ప్రతీకారాలకే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల పాఠశాల పిల్లలతో పాటు మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వంటమనుషులు, సహాయకుల పరిస్థితి కూడా ప్రస్తుతం చాలా దయనీయంగా మారిందని మమత ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం టీఎంసీ పార్టీ గత కొన్నేండ్లలో ఎన్నడూ లేనంతటి అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రితాబ్రతా బెనర్జీ నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రచారం జరుగుతుండగా.. మరో 20 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు త్రిపురకు చెందిన ఒక చిన్న పార్టీలో చేరిపోవడం గమనార్హం.
