వాష్ రూమ్ పక్కన రుమాలి రోటీ తయారీ.. గచ్చిబౌలి అల్సబా రెస్టారెంట్ గలీజ్ మెయింటెనెన్స్

వాష్ రూమ్ పక్కన రుమాలి రోటీ తయారీ.. గచ్చిబౌలి అల్సబా రెస్టారెంట్ గలీజ్ మెయింటెనెన్స్

టాప్ ఐటీ కంపెనీలు ఉండే ఏరియా. సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ తో పాటు సినిమా, పొలిటికల్ లీడర్స్ తిరిగే ప్రాంతం. హైదరాబాద్ లోనే అత్యంత కాస్ట్లీ ఏరియా అయిన గచ్చిబౌలిలో రెస్టారెంట్ నడుపుతున్న తీరు ఫుడ్ సేఫ్టీ అధికారులను షాకింగ్ గురిచేసింది. శుక్రవారం (జులై 10) అధికారుల రైడ్స్ లో వాష్ రూమ్ పక్కన రోటీలు తయారు చేస్తుండటం ఆందోళన కలిగించే అంశం. 

గచ్చిబౌలిలోని అల్‌సబా రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలలో విస్తుపోయే నిజాలను కనుగొన్నారు. అపరిశుభ్రమైన వాష్‌రూమ్ పక్కనే రుమాలి రొట్టెల తయారీ చేస్తుండటం చూసి ఆగ్రహానికి గురయ్యారు. ఫ్రీజర్‌లో మాంసాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసినట్లు గుర్తించారు.

వాష్ ఏరియాలో నీరు నిల్వ ఉండటం, కార్మికుల వాష్‌రూమ్‌లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఈగల మధ్య అపరిశుభ్రంగా చికెన్ స్టోర్ చేసినట్లు అధికారులు చెప్పారు.  నీటి పరీక్ష రిపోర్ట్ లు, ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవన్న తెలిపారు.  అల్‌సబా రెస్టారెంట్ FSSAI లైసెన్స్ సస్పెన్షన్‌ కు చర్యలు తీసుకున్నారు. లోపాలు సరిచేసే వరకు రెస్టారెంట్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఫైర్ వాటర్ నియోబార్ అండ్ కిచెన్‌లో బూజు పట్టిన పీతలు, రొయ్యలు

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఫైర్ వాటర్ నియోబార్ అండ్ కిచెన్‌లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు.  లేబుళ్లు లేని పీతలు, చికెన్, రొయ్యలు తదితర ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.  గడువు ముగిసిన మష్రూమ్స్ వాడుతున్నట్లు గుర్తించారు.

వంట నీరు, ఐస్ తయారీకి ఉపయోగించే నీటి పరీక్షలు చేయకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవని అధికారులు చెప్పారు. వెజ్, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను ఒకేచోట నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు. 

నిల్వ చేసిన ఆహార పదార్థాలపై పేర్లు, లేబుళ్లు లేనట్లు గుర్తించారు. శుభ్రం చేయని గుడ్లను నిల్వ చేసినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. నిబంధనలు పాటించకుండా ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తున్న హోటల్ పై నోటీసులు జారీ చేశారు అధికారులు.