దేశంలో కోట్లాది మంది మెుబైల్ యూజర్లు వాడుతున్న కాల్ మేనేజ్‌మెంట్ యాప్ ట్రూకాలర్‌పై నియంత్రణకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) కీలక అడుగు వేస్తోంది. 140, 1600 సిరీస్ నంబర్ల నుంచి వచ్చే నిజమైన వ్యాపార కాల్స్‌ను తప్పుగా స్పామ్‌గా చూపించడం, బ్లాక్ చేయడాన్ని అరికట్టేందుకు ట్రూకాలర్ లాంటి కాల్ మేనేజ్‌మెంట్ యాప్‌లను పర్యవేక్షించే అధికారం కావాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను ట్రాయ్ తన లేఖలో కోరింది.
ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై MeitY, టెలికమ్యూనికేషన్స్ శాఖ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నంబర్లకు ఐటీ చట్టం కింద "ఆథరైజ్డ్ సంస్థ" హోదా కల్పించాలని ట్రాయ్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇది అమలులోకి వస్తే.. కాల్ మేనేజ్‌మెంట్ యాప్‌లపై నియంత్రణకు ట్రాయ్ తీసుకునే తొలి పెద్ద చర్యగా మారే అవకాశం ఉంది.
140 సిరీస్ నంబర్లు సాధారణంగా టెలిమార్కెటింగ్ సేవలకు, 1600 సిరీస్ నంబర్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వంటి అధికారిక సేవల కోసం ఉపయోగిస్తారు. అయితే కొంతమంది వినియోగదారులు ఈ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను కూడా స్పామ్‌గా భావించి బ్లాక్ చేయడం వల్ల వ్యాపార సంస్థలు, బ్యాంకింగ్ సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ట్రాయ్ భావిస్తోంది.
ఇటీవల ట్రాయ్ ట్రూకాలర్ లాంటి థర్డ్ పార్టీ యాప్‌లకు 140, 1600 సిరీస్ కాల్స్‌పై స్పామ్ హెచ్చరికలు చూపించవద్దని ఆదేశించింది. ఈ నంబర్లు చట్టబద్ధమైన వ్యాపార అవసరాల కోసం కేటాయించబడ్డాయని వెల్లడించింది. అయినా ట్రూకాలర్ మాత్రం ఈ నిర్ణయంపై భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. వినియోగదారుల భద్రత కోసం కమ్యూనిటీ ఆధారిత స్పామ్ హెచ్చరికలు కీలకమని, వాటిని తొలగించడం వల్ల వినియోగదారుల నమ్మకం దెబ్బతినే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.
ట్రాయ్ ఆదేశాలను అంగీకరించి 140, 1600 సిరీస్ నంబర్లను వైట్‌లిస్ట్ చేస్తున్నామని ట్రూకాలర్ సీఈఓ రిషిత్ జున్ జున్‌వాలా చెప్పారు. అయితే ఈ నిర్ణయంతో రోజూ లక్షలాది కాల్స్ ప్రభావితం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ రెండు సిరీస్‌ల నుంచి వచ్చే కోట్లాది కాల్స్‌ను వినియోగదారులు ఇప్పటికే బ్లాక్ చేసినట్లు ట్రూకాలర్ వెల్లడించింది. స్పామ్ కాల్స్‌ను అరికట్టడం.. అదే సమయంలో బ్యాంకులు, కంపెనీల నిజమైన కాల్స్ వినియోగదారులకు చేరేలా చేయడం మధ్య సమతుల్యత సాధించడమే ట్రాయ్ ముందున్న ప్రధాన సవాల్.
