ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి ఉదృతి పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో బుధవారం ( జులై 8 ) పోలవరం ప్రాజెక్టు పైపులు కొట్టుకుపోయాయి.పెరిగిన గోదావరి ఉధృతి కారణంగా పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వేలో ఉన్న మొత్తం 48 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.
ఈ క్రమంలో నీటి ప్రవాహం కోసం వేసిన భారీ ఐరన్ తూర, ఐరన్ పైపులు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. స్పిల్ ఛానల్ కింద పనుల రవాణా కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు కూడా పూర్తిగా కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న స్పిల్‌వే మీదుగా వెళ్లే రోడ్డు మార్గం గుండా రాకపోకలు కొనసాగుతున్నాయి.
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
మహారాష్ట్రతో పాటు ముంబై పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు దగ్గర నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం పోలవరం స్పిల్వే దగ్గర నీటిమట్టం 26.69 మీటర్లకు చేరిందని తెలిపారు అధికారులు. ఎగువ కాపర్ డ్యామ్ దగ్గర నీటి మట్టం 26.80 మీటర్లుగా నమోదైందని తెలిపారు అధికారులు.
