హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో సంచలనం. సోమాజిగూడలోని ప్రముఖ BLISS అపార్ట్‌మెంట్స్ ప్రాజెక్టుపై తెలంగాణ రెరా (TG RERA) పబ్లిక్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ ప్రాజెక్టు హుస్సేన్‌సాగర్ FTL (పూర్తి స్థాయి నీటి మట్టం) , బఫర్ జోన్‌లో ఉన్నట్లు నిర్ధారణ అయిందని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ ప్రాజెక్టుకు ఉన్న RERA రిజిస్ట్రేషన్ గడువు జనవరి 2, 2026 నాటికే ముగిసిపోయిందని.. ప్రస్తుతం దీనికి ఎలాంటి చట్టబద్ధమైన రెరా రిజిస్ట్రేషన్ లేదని వెల్లడించింది.
దీంతో ఈ ప్రాజెక్టులో ఎలాంటి ఫ్లాట్ల విక్రయాలు, బుకింగ్స్, ప్రచారాలు చేయకూడదంటూ ప్రమోటర్లను రెరా ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు ఇరిగేషన్ శాఖ నుంచి ఎలాంటి NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) లేదని ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, హైడ్రా (HYDRAA) ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసింది. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఈ ప్రాజెక్టు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా రుణాలు మంజూరు చేసే ముందు దీని చట్టపరమైన స్థితిని పూర్తిగా పరిశీలించాలని TG RERA సూచించింది.
నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్ కి అనుకుని రెండెకరాల్లో రెండు టవర్లలో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్సంస్థ 153 ఫ్లాట్స్ నిర్మిస్తోంది. పనులు కూడా పూర్తికావొచ్చాయి. ఈ తరుణంలో ఇరిగేషన్ శాఖ తమ అనుమతులు తీసుకోలేదని కంప్లైంట్ చేయడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ఆర్వీ కర్ణన్, హైడ్రా కమిషనర్ంగనాథ్, కలెక్టర్ ప్రియాంక ఆల సైట్ కు వెళ్లి ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉన్నట్లు నిర్ధారించారు.
