ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ సందర్భం వచ్చినప్పుడల్లా ఎనలేని అభిమానం చూపిస్తున్నారు. బండ్ల గణేష్ తన కూతురు జనని పెండ్లి పత్రికలో.. ‘‘శ్రీమతి నారా భువనేశ్వరి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు’’ ఆశీస్సులతో అని పేర్కొనడం ఆసక్తిని రేకెత్తించింది. ఇలా చంద్రబాబుపై బండ్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకు టీడీపీ శ్రేణులు ఉబ్బితబ్బిబవుతుంటే.. ‘‘విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ పవన్ కల్యాణ్’’ అని లేకపోవడం పవన్ కల్యాణ్ అభిమానులను బాధించింది.
ఎందుకంటే.. ‘‘ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా..’’ అని ఇన్నాళ్లూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను అభిమానించిన, కాదు.. కాదు.. ఆరాధించిన బండ్ల గణేష్ ఇలా చంద్రబాబుపై తన అభిమానాన్ని చాటుకోవడంపై పవన్ అభిమానులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్లో ఉన్న సమయంలో కూడా బండ్ల గణేష్ హైదరాబాద్లో ఒక పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. అంతేనా.. ఆ సమయంలో చంద్రబాబు, ఆయన కుటుంబ పరిస్థితిపై బండ్ల గణేష్ భావోద్వేగంతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు.
చంద్రబాబు ఈ దేశానికి, ఈ ప్రపంచానికి అవసరం అని బండ్ల ప్రకటించారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలైతే క్షేమంగా ఉంటే తిరుమలకు కాలినడకన వస్తానని బండ్ల మొక్కుకున్నారు. సంకల్ప యాత్ర పేరుతో షాద్ నగర్లోని తన నివాసం నుంచి బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర చేసి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఇలా సందర్భం వచ్చిన ప్రతిసారీ.. ఏపీ సీఎం చంద్రబాబుపై నిర్మాత బండ్ల గణేష్ తన అభిమానాన్ని ప్రదర్శించుకుంటున్నారు. ఇప్పుడు కూతురి పెండ్లి పత్రికలో కూడా చంద్రబాబు, భువనేశ్వరి ఆశీస్సులతో అని రాయించి.. బండ్ల గణేష్ కరుడుగట్టిన చంద్రబాబు అభిమానిగా తెలుగు తమ్ముళ్లలో ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఈ పరిణామం పవన్ అభిమానులకు కొంత ఇబ్బందికరంగానే ఉంది.
ALSO READ : వివాదాల మధ్య ఎన్టీఆర్ మూవీ.. రుద్రప్రయాగలోనే షూటింగ్‌కు కారణమేంటి?
ఎందుకంటే.. బండ్ల గణేష్ అంటే పవన్ కల్యాణ్ వీరాభిమాని కాదు వీర భక్తుడని ఇన్నాళ్లు పవన్ అభిమానులు భావించారు. ఇప్పటికీ భావిస్తున్నారు. అలాంటి బండ్ల గణేష్ చంద్రబాబుపై అపరిమిత అభిమానం చూపిస్తుంటే.. బండ్లకు పవన్ కల్యాణ్పై స్వామి భక్తి కాస్తంత తగ్గి చంద్రబాబుపై పెరిగిందేమోనని పవన్ అభిమానులు చర్చించుకుంటున్నారు. జనసేన, టీడీపీ కూటమి పార్టీలే కావడంతో.. చంద్రబాబుపై అభిమానాన్ని చాటుకోవడం వల్ల ప్రస్తుతానికి బండ్ల గణేష్కు వచ్చిన నష్టమేం లేదు.
బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని JRC కన్వెన్షన్లో ఆగస్ట్ 16న జరగనుంది. ఈ పెళ్లికి తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇద్దరికీ బండ్ల గణేష్ అత్యంత ప్రీతిపాత్రుడు కావడంతో.. ఏపీ నుంచి పవన్, చంద్రబాబు ఇద్దరూ.. బండ్ల కుమార్తె పెళ్లికి హాజరవుతారో లేక పవన్ కల్యాణ్ మాత్రమే హాజరవుతారో చూడాలి.
