కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఎప్పుడు లెటర్ రాస్తే.. అప్పుడే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెడదామని, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎంత సమయం మాట్లాడాలనుకుంటే అంత సమయం ఇస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ కేసీఆర్ వాదనలో బలముందని రుజువైతే.. రాబోయే మూడేళ్ల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ల బాధ్యతను, మేజర్ కాంట్రాక్ట్‌ను కేసీఆర్‌కే అప్పగిస్తామని.. ఆయన ఇష్టం వచ్చిన వాళ్లకు ఆ కాంట్రాక్ట్ ఇచ్చుకోవచ్చంటూ సంచలన సవాల్ చేశారు.
బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌లను ‘ఆర్థిక ఉగ్రవాదులుగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. కేసీఆర్ కట్టిన ఇతర ప్రాజెక్టులను, ప్రజాభవన్, సెక్రటేరియట్లను తాము వాడుతున్నామని.. కానీ, కాళేశ్వరం విషయంలో గత ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వల్లే అది నిరూపయోగంగా మారిందని మండిపడ్డారు. ప్రస్తుతానికి బ్యారేజీల్లో నీళ్లు నింపి ఎత్తిపోయాలని ఏ ఎక్స్‌పర్ట్స్ కమిటీ కూడా చెప్పలేదని రేవంత్ గుర్తుచేశారు. ఒకవేళ బలవంతంగా నీళ్లు నింపితే బ్యారేజీలు పూర్తిగా కూలిపోతాయని, భద్రాచలం నగరం మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు."
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు తీసుకోకుండానే.. తాము అధికారంలోకి వచ్చాకవేల కోట్ల అప్పులు కట్టాల్సి వచ్చిందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. నిపుణుల కంటే ఎవరు మంచి సలహాలు ఇచ్చినా తీసుకుంటామని, కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడకూడదని ఆయన అన్నారు. ప్రజా సొమ్ము గోదారి పాలు కాకుండా కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
