AIG ఆస్పత్రిలో చేరిన  హిమాన్షు.. మనవడిని చూసేందుకు వెళ్లిన కేసీఆర్

AIG ఆస్పత్రిలో చేరిన  హిమాన్షు.. మనవడిని చూసేందుకు వెళ్లిన కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు ప్రమాదానికి గురయ్యారు. గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) హాస్పిటల్‌లో హిమాన్షు అడ్మిట్ అయ్యారు. జిమ్ లో వర్కవుట్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ హిమాన్షు ముక్కుకు గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు హిమాన్షుకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఈ విషయం తెలియగానే మనవడు హిమాన్షును పరామర్శించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. హిమాన్షు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  కేసీఆర్ కూడా ఇదే సమయంలో తన వ్యక్తిగత సాధారణ హెల్త్ చెకప్ చేయించుకునే అవకాశం ఉందని ఆయన సిబ్బంది వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏఐజీ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరో వైపు తన కొడుకు ఆరోగ్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హిమాన్షు జులై 6న సాయంత్రం స్పోర్ట్స్ ఇంజురీతో గాయపడ్డాడని..ప్రస్తుత ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు.  గాయం చిన్నదేనని మరికొన్ని రోజుల్లో హిమాన్షు  పూర్తిగా కోలుకుంటాడని అన్నారు.  తన కొడుకు ఆరోగ్యంపై ఆరాదీసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్.