ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భారీ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఆలయ పునర్నిర్మాణ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా..అధికారులు ప్రోక్లైన్ల సాయంతో ఆలయ పాత రాజగోపురాన్ని కూల్చివేస్తున్నారు.
ఆలయంలోని పాత రాజగోపురంతో పాటు గర్భాలయానికి ఇరువైపులా ఉన్న మండపాలు, వంటశాల, ఇతర పాత కట్టడాలు శిథిలావస్థకు చేరడంతో వాటి స్థానంలో నూతన శోభను తీసుకురావడానికి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగమ శాస్త్ర నియమాలను, పూజారుల సూచనలను పాటిస్తూ ఈ కూల్చివేతలు ప్రణాళికాబద్ధంగా సాగుతున్నాయి.కూల్చివేతలు , నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ.. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు. అక్షరాభ్యాసాలు, నిత్య పూజలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
ముగ్గురమ్మల కొలువు..
కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ప్రశాంతత కోరి గోదావరి తీరానికి విచ్చేసిన వేద వ్యాస మహర్షి.. బాసరలో ఇసుకతో జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి మూర్తులను ప్రతిష్టించారని స్థల పురాణం చెబుతోంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఏటా భక్తుల తాకిడి పెరుగుతోంది. ముఖ్యంగా వసంత పంచమి, దేవీ నవరాత్రులు, చిన్నారుల అక్షరాభ్యాసాల సమయంలో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బాసర ఆలయం అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది.
శృంగేరి పీఠం ఆశీస్సులతో మాస్టర్ ప్లాన్..
ఆలయ పునర్నిర్మాణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా శృంగేరి పీఠాధిపతుల సంప్రదింపులతో తుది ప్రణాళిక సిద్ధం చేశారు. గర్భాలయం, అర్థ మండపం, గోపురాలు, మాడ వీధుల నిర్మాణానికి వారి అనుమతులు తీసుకున్నారు. ప్రస్తుతం 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయ పరిధిని 5 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఆలయానికి ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురాన్ని, మిగిలిన మూడు దిశల్లో 7 అంతస్తుల గోపురాలను నిర్మించనున్నారు. 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాఢ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు.
