- సర్దార్‌నగర్ అటవీ బ్లాక్‌కు రిజర్వ్‌డ్ హోదా
- మహేశ్వరం మండలం మంఖాల్‌లో 280 ఎకరాల గుర్తింపు
- రియల్ ఎస్టేట్ కబ్జాలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం నిర్ణయం
- ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్‌గా రంగారెడ్డి అదనపు కలెక్టర్ నియామకం
- ఈ వారమే రిజర్వ్‌డ్ ఫారెస్ట్ నోటిఫికేషన్.. అర్బన్ ఫారెస్ట్ పార్కుగా అభివృద్ధి చేసే చాన్స్
హైదరాబాద్, వెలుగు: కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న హైదరాబాద్ నగర శివార్లలో మరో ప్రకృతి వనం సిద్ధం కాబోతోంది. రంగారెడ్డి జిల్లా
మహేశ్వరం మండల పరిధి మంఖాల్ గ్రామంలోని వందల ఎకరాల అటవీ భూమికి రిజర్వ్‌డ్ హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. శంషాబాద్ డివిజన్ పరిధిలోని ‘సర్దార్‌నగర్ ఫారెస్ట్ బ్లాక్’ను రిజర్వ్‌డ్ ఫారెస్ట్‌గా మారుస్తూ పర్యావరణ, అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 280 ఎకరాల విస్తీర్ణంలోని ఈ అటవీ భూమి ఇకపై ప్రభుత్వ రక్షణలో ఉండనున్నది. నగరానికి సమీపంలో ఉండడం, రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతుండడంతో మహేశ్వరం, శంషాబాద్ ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరిగాయి.దీంతో అటవీ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్నుపడింది.
ఈ ప్రాంతంలోని అటవీ భూములు అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం దృష్టికి అటవీశాఖ తీసుకెళ్లింది. సర్దార్‌నగర్ బ్లాక్ పరిధిలోని భూములను ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. తెలంగాణ అటవీ చట్టం-1967లోని సెక్షన్ 4 ప్రకారం.. ఈ భూమిని రిజర్వ్‌డ్ ఫారెస్ట్‌గా ప్రకటించాలని నిర్ణయించింది. దీనివల్ల ఈ భూమిలో అడుగుపెట్టాలన్నా, ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా చట్టరీత్యా నేరమవుతుంది.
18 సర్వే నంబర్లు.. 113 హెక్టార్లు
మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామంలోని మొత్తం 18 సర్వే నంబర్లలో ఈ అటవీ బ్లాక్ విస్తరించి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇవన్నీ అటవీ వర్గీకరణలో ఉన్నవే. సర్వే నంబర్లు 103 నుంచి 115 వరకు, అలాగే 116/2, 117, 118, 119/1, 120/1 లలోని భూమిని ఈ బ్లాక్‌లో కలిపారు. ఈ మొత్తం ప్రాంతాన్ని ‘సర్దార్‌నగర్ రిజర్వ్‌డ్ ఫారెస్ట్’గా పిలవనున్నారు. అయితే, మంఖాల్ గ్రామంలోని సర్వే నంబర్లు 103 నుంచి 120/1 వరకు ఉన్న మొత్తం 280.09 ఎకరాల (113.35 హెక్టార్లు) భూమిని అటవీశాఖ తన పరిధిలోకి తీసుకోనున్నది. ఈ బ్లాక్ ఉత్తర సరిహద్దు మామిడిపల్లి నుంచి ప్రారంభమై.. తూర్పున హైదరాబాద్- శ్రీశైలం హైవే వరకు, పడమరన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాంపౌండ్ వాల్ వరకు విస్తరించి ఉంది. ఈ మేరకు అటవీశాఖ మ్యాప్‌లను కూడా రెడీ చేసింది.
ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్ నియామకం..
రిజర్వ్‌డ్ ఫారెస్ట్‌గా ప్రకటించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)ను ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్‌గా నియమించింది. ఈ భూమిపై స్థానికులకు ఏవైనా హక్కులు ఉన్నాయా? లేదా ఇతర అభ్యంతరాలు ఉన్నాయా? అనే అంశాలను తేల్చనున్నారు. ఈ అటవీ భూముల్లో ఎవరికైనా వ్యక్తిగత హక్కులు, సాగు హక్కులు లేదా ఇతర క్లెయిమ్‌లు ఉంటే వారు సెటిల్‌మెంట్ అధికారికి విన్నవించుకోవాల్సి ఉంటుంది. అటవీ ఉత్పత్తులపై స్థానికులకు ఉండే హక్కులను ఆయన విచారిస్తారు. భూమిపై ఎవరికైనా క్లెయిమ్స్ ఉంటే వాటిని పరిశీలించి, అభ్యంతరాల స్వీకరణ తర్వాత అన్ని అంశాలను పరిశీలించి నిర్ణీత గడువులోగా నివేదిక సమర్పిస్తారు. ఆ తర్వాతే తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు.
.అర్బన్ ఫారెస్ట్ పార్కుగా మారే చాన్స్
నగరానికి ఆనుకొని ఉన్న సర్దార్‌నగర్ అటవీ ప్రాంతాన్ని భవిష్యత్తులో అర్బన్ ఫారెస్ట్ పార్క్ గా అభివృద్ధి చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ అటవీ బ్లాక్ భౌగోళికంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. పశ్చిమాన శంషాబాద్ విమానాశ్రయ అథారిటీకి చెందిన కాంపౌండ్ వాల్ ఈ అడవికి సరిహద్దుగా ఉంది. తూర్పున హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారికి సమీపంలో, ఉత్తరాన మామిడిపల్లి మంఖాల్ గ్రామాల ఉమ్మడి సరిహద్దుల వరకు ఈ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఎయిర్‌పోర్ట్ వెళ్లే ప్రయాణికులకు, మహేశ్వరం వైపు ఉండేవారికి ఆక్సిజన్ హబ్‌గా మారనున్నది. కలుషితమవుతున్న నగర వాతావరణంలో ఇలాంటి అటవీబ్లాక్‌ల రక్షణ కీలకమని పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ వారమే గెజిట్‌నోటిఫికేషన్ వెలువరించనున్నారు.
