బాసర, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆదివారం నిర్వహించిన కళాపకర్షణ పూజలు వైభవంగా జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తులను బాలాలయంలో వేదోక్తంగా ప్రతిష్ఠించారు. శృంగేరి పీఠాధిపతులు అందజేసిన దారు విగ్రహాలకు(ఉత్సవమూర్తులు) తెల్లవారుజామున శృంగేరి నుంచి వచ్చిన పండితులు, ఆలయ అర్చకులు, వేద పండితులు అభిషేకం నిర్వహించారు.
అనంతరం అమ్మవారి సన్నిధిలో సంకల్పం, గణపతి పూజ, కళాపకర్షణ పూజలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తర్వాత ఉత్సవమూర్తులను ఊరేగింపుగా బాలాలయానికి తీసుకెళ్లి ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్, ప్రధాన ఆలయ నిర్మాణ దాతలు సురపనేని సునంద్, పద్మప్రియ దంపతులను ఆలయ ఈవో అంజనీదేవి పట్టువస్త్రాలతో సత్కరించారు.
