- తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి పీకే
- 1990 నుంచి బీజేపీకి కంచుకోటగా బంకీపూర్
పాట్నా: ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలో పోటీ చేస్తున్నట్లు ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఈ ఉపఎన్నికను రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు ఇచ్చే తీర్పుగా (రెఫరెండం) ఆయన అభివర్ణించారు. బీజేపీ నేత నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో బంకీపూర్ స్థానం ఖాళీ అయింది.
ఈ నేపథ్యంలో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ సందర్భంగా పీకే మాట్లాడుతూ.. ‘బంకీపూర్‌లో విద్యావంతులు, సంపన్నులు ఉన్నారు. నాపై నమ్మకంతో గెలిపిస్తే, అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న 242 మంది ఎమ్మెల్యేల కంటే బలంగా గళం వినిపిస్తా’ అన్నారు.
ప్రజల తీర్పు లేకుండానే బీజేపీ నేత సామ్రాట్ చౌదరి సీఎం అయ్యారని విమర్శించారు. ఈ రెండు నెలల ప్రభుత్వ పాలనకు బంకీపూర్ ఉప ఎన్నిక ఓ రిఫరెండం అని, తాము గెలిస్తే బీజేపీ పతనం ఖాయమని జోస్యం చెప్పారు.1990 నుంచి బంకీపూర్ స్థానం బీజేపీకి కంచుకోటగా మారింది.
ఇక్కడి నుంచి మళ్లీ గెలుస్తామని ధీమాగా ఉన్నప్పటికీ బీజేపీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. మరోవైపు, ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి కూడా ఇంకా వారి వ్యూహాన్ని వెల్లడించాల్సి ఉంది. ఇదేసమయంలో ‘జనశక్తి జనతాదళ్’ పార్టీ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ సామాజిక కార్యకర్త వీణా మాన్విని ఇక్కడ బరిలోకి దించారు. జూలై 6 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 30న పోలింగ్, ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
