కాశ్మీర్ పండ్ల తోటలో టెర్రరిస్టులు.. చుట్టుముట్టిన భద్రతాదళాలు

కాశ్మీర్ పండ్ల తోటలో టెర్రరిస్టులు..  చుట్టుముట్టిన భద్రతాదళాలు

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని షోపియాన్ జిల్లాలో ఇద్దరు లష్కరే తోయిబా టెర్రరిస్టులు ఓ పండ్ల తోటలో కనిపించారు. ఆ తోటలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో శుక్రవారం వీరిద్దరూ కనిపించడంతో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. వారిని పట్టుకోవడానికి ఆర్మీ భారీ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేపట్టింది. ఆ ప్రాంతంలో మొత్తం ఏడు గ్రామాలు ఉన్నాయి. ఆర్మీ, పోలీస్, సీఆర్​పీఎఫ్ జాయింట్​టీం ఈ ప్రాంతం చుట్టూ గట్టి నిఘా ఏర్పాటు చేసి, సాయంత్రానికి 4 గ్రామాలను ఖాళీ చేయించింది.

పండ్ల తోటలో దాక్కున్న ఆ ఇద్దరు టెర్రరిస్టులను కుల్గామ్ జిల్లాకు చెందిన లతీఫ్, జాకీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా గుర్తించారు. జాకీర్ 2024లో, లతీఫ్ 2025లో లష్కరే తోయిబాలో చేరినట్టు తెలిసింది. కాగా, సెర్చ్​ ఆపరేషన్ ​చేస్తున్న భద్రతా దళాలపైకి టెర్రరిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఇరువర్గాల మధ్య తీవ్రమైన ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. టెర్రరిస్టులు ఆ పండ్ల తోట నుంచి తప్పించుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను ఆర్మీ అధికారులు మూసివేశారు.

దక్షిణ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సెంట్రల్ కాశ్మీర్, పీర్ పంజాల్ శ్రేణితో అనుసంధానించడంలో షోపియాన్ జిల్లా చరిత్రాత్మకంగా అత్యంత కీలక  రవాణా మార్గంగా ఉంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇక్కడి దట్టమైన చెట్ల పొదలు టెర్రరిస్టులకు సహజమైన రక్షణను కల్పిస్తాయి. పాకిస్తాన్ మద్దతుతో వచ్చే ఫారెన్​ టెర్రరిస్టులు దాడులకు పాల్పడుతున్నప్పటికీ.. లతీఫ్, జాకీర్ వంటి స్థానిక టెర్రరిస్టులను అణచివేయడం చాలా ముఖ్యమని అధికారులు చెప్పారు. దీనివల్ల వారి నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దెబ్బతీయడంతో పాటు, స్థానిక యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా అడ్డుకోవచ్చని భద్రతా దళాలు భావిస్తున్నాయి.