కాళేశ్వరం నీళ్లు వాడకున్నా అత్యధిక దిగుబడి వచ్చింది.. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

కాళేశ్వరం నీళ్లు వాడకున్నా అత్యధిక దిగుబడి వచ్చింది.. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి
  • నేషనల్​ డ్యాం సేఫ్టీ అధికారుల సూచనలే అమలు చేస్తున్నం : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : 'గత పాలకులు అవినీతి సొమ్ము కోసం ఆశపడి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కూలేశ్వరంగా మార్చారు, గతేడాది కాళేశ్వరం నీటిని వాడకున్నా అత్యధిక పంట దిగుబడి వచ్చింది' అని మంత్రి సీతక్క చెప్పారు. ములుగు క్యాంప్ ఆఫీస్ లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. 

బీఆర్​ఎస్​నేత కేటీఆర్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. తమ ప్రభుత్వానికి ప్రజల భద్రతే ముఖ్యమన్నారు. లక్షల కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం బీఆర్ ఎస్ హయాంలోనే కుంగిపోతే రిపేర్లు ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ప్రస్తుతం కాళేశ్వరం వద్ద ఎత్తిపోతలు చేపడితే గోదావరి పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలకు ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉందన్నారు. నీళ్లు ఎత్తిపోయాలని చెబుతున్న కేటీఆర్... నేషనల్ డ్యాం సేఫ్టీ ఆఫీసర్లతో మాట్లాడాలని సూచించారు. బీఆర్​ఎస్​నాయకులు స్వయం ప్రకటిత మేధావులు, ఇంజినీర్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో నిధులు ఎత్తుకుపోయారు కాబట్టే.. ఇప్పుడు నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అహంకార పూరితంగా, అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్న బీఆర్ ఎస్ నేతలకు రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రజలపై ప్రేమలేదన్నారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల కోసం పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. 

మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్​, కిసాన్​సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్, మార్కెట్​కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, పంచాయతీరాజ్​శాఖ రాష్ట్ర డైరెక్టర్ బైరెడ్డి భగవాన్​రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు, మున్సిపల్ చైర్ పర్సన్ చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి పాల్గొన్నారు.