- ఇప్పటి వరకు 92 షాపుల్లో తనిఖీలు
- గతేడాది గోదావరి పరీవాహక ప్రాంతంలో నకిలీ సీడ్స్తో నష్టపోయిన 671 మంది రైతులు
- రూ.3.80 కోట్లు పరిహారం చెల్లించిన కంపెనీలు
- లైసెన్స్డ్ షాపుల్లోనే విత్తనాలు కొనాలంటున్న అధికారులు
ములుగు, వెలుగు: ఆరు గాలం కష్టపడే రైతులను నకిలీ విత్తనాలు తీవ్రంగా నష్టపరుస్తున్న నేపథ్యంలో, కాసుల కోసం రైతులను మోసం చేస్తున్న కంపెనీలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతులు మరోసారి నకిలీ విత్తనాల బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలతో తనిఖీలు చేపడుతోంది.
నాణ్యమైన విత్తనాలు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటోంది. ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు స్వయంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఓవైపు ఎల్‌నినో ప్రభావంపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుండగా, మరోవైపు నకిలీ విత్తనాల ప్రభావం రైతులపై పడకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
నకిలీల ఏరివేతకు రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలు..
ములుగు జిల్లాలోని 10 మండలాల్లో మొత్తం 257 ఎరువులు, పురుగుమందుల దుకాణాలు ఉన్నాయి. వీటిలో ములుగు డివిజన్‌లో 73, ఏటూరునాగారం డివిజన్‌లో 184 షాపులు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు.
వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు సాగుకు సిద్ధమవుతూ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు వివిధ కంపెనీల నుంచి కొనుగోలు చేసిన విత్తనాలు మొలకెత్తకపోవడం, పంట ఆశించిన స్థాయిలో దిగుబడి ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు రెండు నెలల కిందనే రెండు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు.
కలెక్టర్ పర్యవేక్షణలో ఈ బృందాలు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాలు, బిల్లులు లేకుండా ఎరువులు, విత్తనాల విక్రయం వంటి అక్రమాలపై చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటివరకు జిల్లాలోని రెండు డివిజన్ల పరిధిలో 92 షాపులను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. గతేడాది రాంచంద్రాపూర్, అబ్బాపూర్‌లోని ఫర్టిలైజర్ షాపులపై కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి కేసులు నమోదు కాకపోవడం విశేషం.
గతేడాది 671 మంది రైతులకు రూ.3.80 కోట్ల పరిహారం..
నకిలీ విత్తనాల కారణంగా గతేడాది రైతులు తీవ్రంగా నష్టపోయి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి సీతక్క సంబంధిత కంపెనీలపై ఒత్తిడి తీసుకొచ్చారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాలకు చెందిన 671 మంది రైతులు 1,521 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు.
అయితే విత్తనాల నాణ్యత లోపం వల్ల పంట సరిగా ఎదగకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారుల విచారణలో నాలుగు ప్రధాన మల్టీనేషనల్కంపెనీలకు చెందిన మొక్కజొన్న విత్తనాల వల్లే పంట నష్టం జరిగినట్లు తేలింది.
దీంతో ప్రభుత్వం కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చి, 2025 జూలై 7న రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క వాజేడు మండలంలో 671 మంది రైతులకు రూ.3.80 కోట్ల పరిహార చెక్కులను అందజేశారు. అంతకుముందు నాలుగేళ్ల కింద కూడా నకిలీ మిర్చి విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
రైతులను మోసం చేస్తే లైసెన్స్లు రద్దు చేస్తాం..
రైతులకు నాసిరకమైన విత్తనాలు కట్టబెట్టినా, రసీదు లేకుండా ఎరువులు, విత్తనాలు విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే లైసెన్స్ లు రద్దు చేస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయించాలి.
రైతులు కూడా లైసెన్స్ పొందిన షాపుల్లోనే కొనుగోలు చేసి, బిల్లు తీసుకోవాలి. ఏవైనా సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించి వారి సూచనల మేరకు సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.
సురేశ్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, ములుగు
