క్యూర్ బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ.. పబ్లిక్ డొమైన్లో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

క్యూర్ బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ.. పబ్లిక్ డొమైన్లో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
  • బిల్లులో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల విభజన అంశాలు
  • పాత జీ హెచ్​ఎంసీ చట్టంలోని అంశాల కొనసాగింపు
  • సీఎం అధ్యక్షతన క్యూర్​ అపెక్స్​ గవర్నెన్స్​ కౌన్సిల్​ ఏర్పాటుకు నిర్ణయం
  • జులై 24 వరకు అభిప్రాయ సేకరణకు గడువు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మహానగర పరిధిలో పట్టణ పరిపాలనను పూర్తిగా ఆధునీకరించేందుకు ‘కోర్ అర్బన్ రీజియన్ బిల్లు, 2026’ (క్యూర్ బిల్లు) ముసాయిదాను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆ బిల్లును పబ్లిక్ డొమైన్​లో ఉంచింది. ప్రస్తుతం అమలులో ఉన్న 1955 నాటి పాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్​ఎంసీ) చట్టం స్థానంలో కొత్త సంస్కరణలను తీసుకురానున్నారు.

హైదరాబాద్ జనాభా గతంలో 15 లక్షల నుంచి ప్రస్తుతం దాదాపు 1.3 కోట్లకు పెరిగినందున ఈ మార్పులు అనివార్యమని ప్రభుత్వం పేర్కొంది.మెట్రోపాలిటన్ ప్రాంతంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిన నేపథ్యంలో, ప్రస్తుత చట్టం కాలానుగుణ అవసరాలకు సరిపోవడం లేదని ప్రభుత్వం పేర్కొంది.

బిల్లులోని ముఖ్యాంశాలు ఇవే..

గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్​ఎంసీ)తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఒకే సమగ్ర పాలన పరిధిలోకి తీసుకొచ్చారు. మెట్రోపాలిటన్ స్థాయిలో సమన్వయం చేస్తూనే కార్పొరేషన్ స్థాయిలో వికేంద్రీకృత పరిపాలన కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. పాత జీహెచ్​ఎంసీ చట్టంలోని కొన్ని అంశాలను ఈ బిల్లులో కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కార్పొరేషన్లు, స్టాండింగ్ కమిటీలు, కమిషనర్లు, వార్డ్ కమిటీలు, ఎన్నికల నిర్వహణ, ఆస్తి పన్ను పరిపాలన, రుణాల సేకరణ అధికారాలు, జంతు సంరక్షణ వంటి ప్రధాన నిబంధనలు కొనసాగుతాయి. ‘మున్సిపల్ సంస్థల్లో ట్రాన్స్‌జెండర్ సభ్యుడికి ప్రాతినిధ్యం కల్పించడం. కాలం చెల్లిన ఎన్నికల అనర్హత నిబంధనలను తొలగించడం’ వంటివాటిని బిల్లులో చేర్చారు. 

ఆస్తి పన్ను విషయంలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. వార్షిక అద్దె విలువ విధానానికి బదులుగా మూలధన విలువ  ఆధారిత విధానం అమలు చేయనున్నట్టు బిల్లులో పేర్కొన్నారు. ఆక్ట్రాయ్, కుక్క పన్ను రద్దు చేశారు. ఆస్తుల స్వీయ అంచనా (సెల్ఫ్​ అసెస్​మెంట్) విధానం ప్రవేశపెట్టారు. సమగ్ర ఆస్తి గుర్తింపు కోడ్, సమయానికి పన్నులు చెల్లించే వారికి రాయితీలు కల్పించారు. ‘జీఐఎస్​ ఆధారిత వీధుల అభివృద్ధి ప్రణాళికలు, యూనివర్సల్ డిజైన్ ప్రమాణాలు,  భూగర్భ యుటిలిటీ వ్యవస్థలు, భవనాల నిర్మాణాలకు డీమ్డ్ అప్రూవల్ విధానం, చిన్నపాటి ఉల్లంఘనలకు క్రిమినల్ చర్యల బదులుగా దశలవారీ సివిల్ జరిమానాలు, అన్ని వ్యాపారాలకు ఒకే ట్రేడ్ లైసెన్స్ విధానం, నైట్ ఎకానమీకి ప్రత్యేక విధానం’ వంటి సంస్కరణలను బిల్లులో చేర్చారు. 

ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యూర్​ అపెక్స్​ గవర్నెన్స్​ కౌన్సిల్​

రాష్ట్ర సీఎం అధ్యక్షతన క్యూర్​ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ అండ్​ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ముసాయిదా బిల్లులో తెలిపారు. చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం హైడ్రాకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నిర్వహణ, వాతావరణ మార్పు చర్యలు, వారసత్వ పరిరక్షణ, ఆహార భద్రత, లింగ సమానత్వం, కార్మిక సంక్షేమం కోసం ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ‘ప్రజారోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక అధికారాలు. ప్రజా ఇబ్బందుల పరిష్కార వ్యవస్థ సరళీకరణ. మ్యాన్యువల్ స్కావెంజర్స్ చట్టానికి తగ్గట్టుగా పారిశుధ్య వ్యవస్థ. నీటి సరఫరా, మురుగునీటి నియంత్రణ బాధ్యతలను హెచ్​ఎండబ్ల్యూఎస్​ఎస్​బీకి అప్పగించడం. 

సమగ్ర పాలన కోసం కొత్త సంస్థలు’ ఏర్పాటు చేయనున్నట్టుగా బిల్లులో పేర్కొన్నారు. ఫిర్యాదుల త్వరిత పరిష్కారం కోసం క్యూర్​ పరిధిలో అప్పీలేట్ అథారిటీ ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర సమన్వయం, బహుళ సంస్థల పర్యవేక్షణ కోసం ‘క్యూర్​ స్మార్ట్​ గవర్నెన్స్ సెంటర్’ ఏర్పాటు చేస్తామని బిల్లులో ప్రతిపాదించారు. సమగ్ర డిజిటల్ పోర్టల్ ఒకే సమీకృత యుటిలిటీ బిల్లు విధానాన్ని అమలు చేస్తామన్నారు. వ్యాపారుల కోసం విడివిడిగా కాకుండా 'సింగిల్ ట్రేడ్ లైసెన్స్' విధానం ప్రవేశపెడతారు. భవన అనుమతుల కోసం నిర్దేశిత కాలంలో అనుమతి రాకపోతే ఆమోదించినట్టుగా భావించే ‘డీమ్డ్ అప్రూవల్’ వ్యవస్థ తీసుకొచ్చారు. 

జులై 24 వరకుప్రజాభిప్రాయ సేకరణ 

ఈ బిల్లును చట్టంగా మార్చే ముందు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. కొత్త బిల్లు వల్ల నివాస, వాణిజ్య ఆస్తి పన్నుల విధానంలో రాబోయే మార్పులపై ప్రజల స్పందన తెలుసుకోవాలని భావిస్తున్నది. మూడు వేర్వేరు కార్పొరేషన్ల పరిధులను విలీనం చేసి ఒకే విధమైన ఫీజులు వసూలు చేయడంపై ప్రజల ఆమోదం అవసరం ఉన్నది. ఈ ముసాయిదా బిల్లుపై ప్రజలు, నిపుణులు తమ సూచనలు, సలహాలను అందించడానికి ఈ నెల 24 వరకు గడువు విధిస్తూ ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశం కల్పించారు. ప్రజలు, నిపుణులు, అన్ని వర్గాల భాగస్వాములు ఈ ముసాయిదా బిల్లుపై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది.