- ఉత్తర్వులు జారీ చేసిన ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీ విజయేంద్ర బోయి
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ ఉపకులాల్లో 'మాంగ్' సామాజిక వర్గానికి చెందిన ప్రజలు క్యాస్ట్ సర్టిఫికెట్లు పొందేందుకు పడుతున్న ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఈ మేరకు ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీ విజయేంద్ర బోయి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. మాంగ్ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారం కేవలం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో ), సబ్-కలెక్టర్ అసిస్టెంట్ కలెక్టర్ స్థాయి అధికారులకు మాత్రమే ఉండేది. తాజా సవరణ ప్రకారం రాష్ట్రంలోని అందరూ తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లకు మాంగ్ సామాజిక వర్గలకు ఈ ధృవీకరణ పత్రాలను జారీ చేసే అధికారాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
కాగా, రాష్ర్టంలో ఈ సామాజిక వర్గ జనాభా సుమారు 30 వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది. మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ ప్రభుత్వానికి ఇచ్చిన వినతిపత్రం మేరకు ఈ సవరణ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాంగ్ సామాజికవర్గ ప్రజలు ఆర్డీవో ఆఫీసుల చుట్టూ తిరిగేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. సమయానికి క్యాస్ట్సర్టిఫికెట్లు అందక విద్యార్థులు విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కొత్త నిబంధనలను వెంటనే తెలంగాణ రాష్ట్ర గెజిట్‌లో ప్రచురించాలని, మీసేవ కేంద్రాలు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు సమాచారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక నుంచి మాంగ్ సామాజికవర్గ ప్రజలకు తహసీల్దార్ కార్యాలయం ద్వారా వేగంగా సర్టిఫికెట్లు అందనున్నాయి.
