- రైల్వే బోర్డ్ చైర్మన్ సతీష్ కుమార్
వరంగల్, వెలుగు : కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని భారత్ రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సతీష్ కుమార్ తెలిపారు. అమృత్ భారత్ స్కీంలో భాగంగా కాజీపేట రైల్వే స్టేషన్ లో చేపట్టిన అభివృద్ధి పనులను ఆదివారం పరిశీలించిన అనంతరం ఆర్‍ఎంయూ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆధునిక రోలింగ్ స్టాక్, నెక్ట్స్ జెన్ రైల్వే కోచ్‍లను తయారీ, నిర్వహణ బాధ్యతలు చేపట్టడానికి అవసరమయ్యే పనులను పరిశీలించి, పురోగతిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెయిన్ షెడ్, బోగీ, పెయింట్, వీల్, టెస్టింగ్ పాయింట్లను తనిఖీ చేశారు. ఆనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే అత్యున్నతమైన కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో నిర్మించామన్నారు. ఫ్యాక్టరీ ప్రారంభం నేపథ్యంలో ఇక్కడ చేపట్టబోయే ఉత్పత్తి కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామని చెప్పారు.
ఈ కోచ్ ఫ్యాక్టరీ దేశంలోనే నంబర్ వన్‍గా నిలుస్తుందన్నారు. ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించే అంశంపై కేంద్రం, రైల్వే ఆఫీసర్లు సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు. కాగా, ఫ్యాక్టరీని మరింత అభివృద్ధి చేసే క్రమంలో మరిన్ని భూములు సేకరించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్ ఉన్నారు.
