- వాసనతోనే ఆడపులి జాడ పసిగట్టనున్న మగపులి
- మూడు నుంచి ఏడు రోజుల పాటు ఏకాంతం
- భంగం కలగకుండా చర్యలు చేపట్టిన ఫారెస్ట్ ఆఫీసర్లు
- మూడు నెలల పాటు టైగర్ సఫారీ నిలిపివేత
హైదరాబాద్, వెలుగు : వర్షాకాలం ప్రారంభం కావడంతో అటవీ ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. మరో వైపు పులుల మేటింగ్ కావడంతో మగ పులులు ఆడ తోడును వెతుక్కుంటూ బయలుదేరాయి. ఈ నేపథ్యంలో పులుల ఏకాంతానికి భంగం కలగకుండా.. వర్షాలతో అడవిదారులు దెబ్బతినకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇటు అమ్రాబాద్, అటు కవ్వాల్ ఫారెస్ట్ లలో మూడు నెలల పాటు టైగర్ సఫారీలను నిలిపివేశారు.
వాసనతో పసిగట్టనున్న పులి
పులులు ఒంటరిగా తిరిగేందుకే ఇష్టపడతాయి. ఆడ పులులు మూడు నుంచి నాలుగేండ్ల వయసు వచ్చేసరికి సంతానోత్పత్తికి రెడీ అవుతాయి. మగ పులులు కొంచెం ఆలస్యంగా నాలుగు నుంచి ఐదేండ్ల వయసులో లైంగికంగా పరిపక్వత చెందుతాయి. సంతానోత్పత్తి సమయం రాగానే ఆడ పులిలోని హార్మోన్లలో మార్పులు వస్తాయి.
మగపులిని ఆకట్టుకునేందుకు ఆడ పులి తన మూత్రాన్ని చెట్ల మొదల్లు, రాళ్లపై వదిలేస్తుంది. ఈ వాసనను చాలా దూరం నుంచే పసిగట్టే మగపులి.. కిలో మీటర్ల దూరం ప్రయాణించి ఆడపులి దగ్గరికి చేరుకుంటుంది. ఆడ పులి వాసనను పసిగట్టినప్పుడు మగ పులి తన నోటిని తెరిచి గాలిని లోపలికి పీల్చుకుంటుంది. దీన్నే శాస్త్రీయంగా 'ఫ్లెమెన్ రెస్పాన్స్' అంటారు. దీనిద్వారా ఆడ పులి ఎంత దూరంలో ఉంది, ఏ దశలో ఉందో మగ పులికి స్పష్టంగా తెలిసిపోతుందని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు.
మూడు నుంచి ఏడు రోజులు
పులుల కలయిక ప్రక్రియ అత్యంత విభిన్నంగా ఉంటుంది. ఒకసారి జతకట్టిన తర్వాత దాదాపు మూడు నుంచి ఏడు రోజుల పాటు కలిసే ఉంటాయి. ఈ సమయంలో వేటను కూడా పక్కన పెట్టి పూర్తిగా ఏకాంతంగా గడుపుతాయి. పులులు ఒక రోజులో సుమారు 30 నుంచి 50 సార్లు కలయికలో పాల్గొంటాయి.
ఆడ పులిలో అండం విడుదల కావడానికి ఇన్ని సార్లు మేటింగ్జరగడం ప్రకృతి సిద్ధమైన నియమమని అటవీ అధికారులు చెప్తున్నారు. ఈ సమయంలో మగ పులిలో 'టెస్టోస్టెరాన్' స్థాయిలు గరిష్టంగా ఉంటాయి. ఆడ పులిలో 'ఈస్ట్రోజన్' ప్రభావం కారణంగా మగ పులికి లొంగి ఉంటుంది. మేటింగ్ సమయంలో పులులు చాలా ప్రమాదకరంగా కనిపిస్తాయని ఆఫీసర్లు అంటున్నారు. మగ పులి మరింత దూకుడుగా ఉంటుంది.
ఆడపులి గర్భం దాల్చినప్పటి నుంచి పిల్లలకు జన్మనిచ్చి, వేటాడటం నేర్చుకుని అవి పెద్దయ్యే వరకు (దాదాపు రెండేళ్లు) అన్ని బాధ్యతలు ఆడపులే చూసుకుంటుంది. ఇతర మగ పులుల నుంచి తన పిల్లలను కాపాడుకునేందుకు ఆడపులి ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. ప్రస్తుతం అడవిలో పెద్దపులులు తోడు కోసం అన్వేషణ ప్రారంభించాయి. వీటి ఏకాంతానికి భంగం కలగకుండా అటవీ అధికారులు చర్యలు చేపట్టారు.
పర్యాటకులకు నో ఎంట్రీ
పులుల సంతానోత్పత్తికి జూలై నుంచి సెప్టెంబర్ వరకు అత్యంత కీలక సమయం. ఈ టైంలో టూరిస్ట్ ల వాహనాల శబ్దాలు, జనాల సందడి ఉంటే పులులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి. ఇది పులుల ఏకాంతం, సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో మగ పులులు తమ భూభాగాన్ని కాపాడుకోవడానికి ఆవేశంగా ఉంటాయి.
ఏ చిన్న అలికిడి జరిగినా పర్యాటక వాహనాలపై దాడి చేసే ప్రమాదం ఉంటుంది. దీనికి తోడు భారీ వర్షాల వల్ల అడవిలోని మట్టి రోడ్లు బురదమయంగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కారణం వల్లే... అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లతో పాటు ఏపీలోని నాగార్జున సాగర్ శ్రీశైలం (ఎన్ఎస్టీఆర్) కోర్ ఏరియాల్లో సెప్టెంబర్ నెలాఖరు వరకు టైగర్ సఫారాలను రద్దు చేశారు.
