4 ఓవర్లు.. 60 పరుగులు.. భారత్ ఓటమికి ఇతడే కారణం!

4 ఓవర్లు.. 60 పరుగులు.. భారత్ ఓటమికి ఇతడే కారణం!

IND vs ENG: మాంచెస్టర్ (ఓల్డ్ ట్రాఫోర్డ్) వేదికగా శనివారం జరిగిన రెండో టీ20లో భారత్ పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇండియాపై 4 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ టీమ్ గెలిచింది. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు.. కేవలం 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అలవోకగా ఛేదించింది. ఈ అద్భుత విజయంతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

తొలి ఓవర్‌లోనే షాక్.. ఆపై కౌంటర్ ఎటాక్:
భారీ లక్ష్య ఛేదన ప్రారంభించిన ఇంగ్లండ్‌కు తొలి ఓవర్‌లోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ ఇద్దరూ డకౌట్‌గా వెనుదిరగడంతో జట్టు తీవ్ర కష్టాల్లో పడింది. కానీ, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్ తమదైన శైలిలో అద్భుతమైన కౌంటర్ ఎటాక్‌కు దిగి మ్యాచ్ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశారు.

బ్రూక్ విధ్వంసం.. బెథెల్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్: 
కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్రీజులోకి రాగానే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 15 బంతుల్లోనే 39 రన్స్ చేసి విధ్వంసం సృష్టించిన అతడిని అక్షర్ పటేల్ పెవిలియన్‌కు చేర్చాడు. మరోవైపు జాకబ్ బెథెల్ క్రీజులో పాతుకుపోయి ఇంగ్లండ్‌కు మ్యాచ్ విన్నర్‌గా అవతరించాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 76 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టామ్ బాంటన్ 32 బంతుల్లో 39 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి, బెథెల్‌తో కలిసి 67 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. చివర్లో విల్ జాక్స్ (9), స్యామ్ కరన్ (7) మోస్తరుగా రాణించగా, జోఫ్రా ఆర్చర్ (10 నాటౌట్)తో కలిసి బెథెల్ మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

రాణించిన అభిషేక్, ఇషాన్, శ్రేయస్:  
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేసి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్ కొట్టి తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో తొలి సిక్సర్‌ను నమోదు చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు సమిష్టిగా రాణించి జట్టుకు భారీ స్కోరు అందించినప్పటికీ, బౌలర్లు ఆ టార్గెట్ ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు.

తేలిపోయిన రవి బిష్ణోయ్: 
భారత బౌలర్లలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు (3/40) తీసి సత్తా చాటాడు. అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ పడగొట్టారు. కానీ, ప్రధాన స్పిన్నర్ రవి బిష్ణోయ్ దారుణంగా నిరాశపరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 60 పరుగులు సమర్పించుకుని మ్యాచ్‌ను ఇంగ్లండ్ కి అప్పగించేశాడు. ముఖ్యంగా  రవి బిష్ణోయ్ వేసిన 17 ఓవర్లో జాకభ్ బెథెల్‌ 1NB, 6, NB, 6, 2, 4, 6, 2లతో 29 రన్స్ పీండుకున్నాడు. దీంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లండ్ చేతిలోకి వెళ్లిపోవడంతో భారత్ ఓటమిని చవిచూసింది.