మంచి ఆలోచనలు మనిషిని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతాయి. దురాలోచనల వల్ల అనారోగ్యంతో పాటు, మానసిక అశాంతి.. వంటివి చుట్టుముడతాయి. తద్వారా తనను తాను నశింపచేసుకునే స్థాయికి చేరతాడు మనిషి. అనగనగా ఒక ఊరిలో ఓ గురుకులం ఉంది. అందులో ఎంతోమంది శిష్యులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే విద్యార్థుల్లో ఒకరిని చూసి ఒకరు ఈర్ష్య పడడం, అసూయతో ప్రవర్తించడం గమనించారు గురువర్యులు. ఎలాగైనా వాళ్లలో మార్పు తీసుకురావాలని బాగా యోచించారు. తళుక్కున ఒక ఆలోచన వచ్చింది.
మరుసటి రోజు విద్యార్థులందరినీ పిలిచి, ఒక మూటలో ఉన్న కుళ్లిపోయిన ఉల్లిపాయలను వాళ్ల ముందు పెట్టారు. ఒక్కొక్కరిని ఒక్కో ఉల్లిపాయ తీసుకుని, ఒక చిన్న వస్త్రంలో మూట గట్టి, మరుసటి రోజు ఉదయం వరకు వాళ్ల దగ్గర ఉంచుకోమన్నారు. వాళ్లంతా గురువర్యులు అలా ఎందుకు అంటున్నారో తెలియకపోయినా, ఆయన మాటకు ఎదురు చెప్పలేదు. అందరూ తలో ఉల్లిపాయ తీసుకుని, చిన్న వస్త్రంలో మూట కట్టి వాళ్ల వాళ్ల స్థానాలకు వెళ్లిపోయారు. ఆ రోజంతా ఆ చిన్ని మూటను వాళ్ల దగ్గరే ఉంచుకున్నారు.
సమయం గడిచేకొద్దీ వాసన పెరుగుతోంది. కాని గురువు ఆజ్ఞను పాటించి తీరాలి. అందుకని ఆ రాత్రంతా వాసన భరిస్తూ.. నానాతంటాలు పడి నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారేసరికి ఆ వాసన రెట్టింపయ్యింది. మారుమాట్లాడకుండా విద్యార్థులంతా ఆ మూటలతో గురువు దగ్గరకు వెళ్లారు.
అందరూ గట్టిగా, ‘గురువుగారూ! ఈ వాసన భరించలేకపోతున్నాం’ అన్నారు. అప్పుడు వెంటనే గురువు, ‘నాయనలారా! బయట ఉన్న దుర్వాసననే కాసేపు భరించలేకపోయారు. మరి లోపల ఉన్న ఈర్ష్య అనే కుళ్లును ఎందుకు పోగు చేసుకుంటున్నారు?’ అన్నాడు. వెంటనే విద్యార్థులకు తమ తప్పు తెలిసింది. అప్పటినుంచి అందరూ స్నేహంగా మెలగసాగారు.
మనసులోని అరిషడ్వర్గాల కారణంగా మనిషి అన్నివిధాలుగా పతనానికి చేరువవుతాడు అనడానికి రామాయణం, భారతం... ప్రత్యక్ష ఉదాహరణలుగా కనిపిస్తాయి. మహాభారతంలో దుర్యోధనుడు బాల్యం నుంచి, పాండవుల మీద అసూయతో మరిగిపోయాడు. భీముడిని ఏదో ఒక విధంగా చంపాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తాళ్లతో బంధించి నీళ్లలోకి తోయించాడు, విషం కలిపిన అన్నం పెట్టాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తన కుట్రలు పారలేదు. చివరకు పాండవులను లక్క ఇంట్లో ఉంచి, మట్టుబెట్టాలనుకున్నాడు.
కాని శ్రీకృష్ణుని సాయంతో పాండవులు బయటపడ్డారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా , తన కుట్రలు ఫలించకపోవడంతో, మాయా జూదం ఆడి పాండవులను అరణ్యాలకు పంపాడు. అక్కడ కూడా వారిని సుఖంగా ఉండనివ్వలేదు. అలా తన ఈర్ష్య, అసూయ, ద్వేషం కారణంగా... తాను మరణించడమే కాకుండా, వంశనాశనానికి కారకుడయ్యాడు.
శ్రీమద్రామాయణంలో
రావణుడు తనకు ఉన్న దానితో సంతృప్తి చెందక, ఎక్కడో అడవులలో ఉన్న సీతను అపహరించి, లంకకు తీసుకొచ్చి, అశోకవనంలో బంధించాడు. హనుమంతుడు – సుగ్రీవుడు – వానరుల సాయంతో సముద్రం మీద వారధి నిర్మించి, లంకకు చేరి రావణునితో సహా తన వంశపువారిని సంహరించాడు రాముడు. కేవలం తనలోని దుర్లక్షణం కారణంగానే రావణుడు వంశనాశనానికి కారకుడయ్యాడు.
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. సుగ్రీవుని మీద కోపంతో వాలి, సుగ్రీవుడిని తరిమితరిమి కొట్టాడు. కిష్కింధలో తలదాచుకున్నాడు సుగ్రీవుడు. కొంతకాలానికి రాముని సాయంతో వాలిని సంహరించి, తిరిగి తన రాజ్యాన్ని, తన భార్యను పొందగలిగాడు.
రాముడు ధర్మానికి ప్రతీక. రామునిలో ఈర్ష్య, అసూయ, ద్వేషం వంటి దుర్గుణాలు లేవు. ఆ కారణంగానే ప్రతి పనిలోను విజయం సాధించాడు. పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేస్తున్న సమయంలో కూడా, దుష్ట సంహారం చేసి, మహర్షులను, మునులను సంరక్షించాడు.
సుగ్రీవుని వంటి మంచి మిత్రుడిని పొందాడు. హనుమంతుని వంటి మంచి బంటుని సాధించుకున్నాడు. భరత – లక్ష్మణ – శత్రుఘ్నుని వంటి సోదరులతో హాయిగా జీవించాడు. సీతాదేవి వంటి సద్గుణరాశిౖయెన భార్యతో ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని అనుభవించాడు. చరిత్రలో ‘రామరాజ్యం’ అనే పేరును చిరస్థాయిగా నిలిపాడు.ఇటువంటి కథలను పిల్లలకు నేర్పడం ద్వారా చిన్నతనం నుంచే సద్గుణాలను అలవరచుకోవడానికి అవకాశం ఉంటుంది.
- డా. పురాణపండ వైజయంతి
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు
featureseditor@v6velugu.com కి మెయిల్ చేయండి.
