దాదాపు తొమ్మిది దశాబ్దాల సినీ ప్రయాణం... మూడు తరాలు.. కోట్లాది అభిమానుల ప్రేమ. ప్రపంచంలో ఏ ఫిల్మ్ ఫ్యామిలీకి దక్కని అరుదైన గౌరవం అక్కినేని కుటుంబానిది. మూలస్తంభం అక్కినేని నాగేశ్వరరావు (ANR) వేసిన బలమైన పునాదిపై, అక్కినేని నాగార్జున 'కింగ్'గా సామ్రాజ్యాన్ని విస్తరిస్తే, నేటితరం యువకిషోరాలు నాగచైతన్య, అఖిల్ ఆ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ ముగ్గురూ తమ అనుబంధం, సినిమా పట్ల ఉన్న ప్యాషన్ గురించి చెప్పిన విశేషాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
వారసత్వానికి కేరాఫ్ అడ్రస్..
అక్కినేని నాగేశ్వరరావు (ANR) నుంచి మొదలైన ఈ ప్రయాణం నేడు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ వరకు కొనసాగుతోంది. అయితే నాగార్జునకు వారసత్వం అంటే కేవలం నటన కాదట. సినిమాను ప్రేమించడం, దానికి సేవ చేయడం కూడా వారసత్వమే అని ఆయన స్పష్టం చేశారు. మా నాన్నగారు సినిమానే శ్వాసగా బతికారు. ఆ నాటి తపన, క్రమశిక్షణే నన్ను నడిపించాయన్నారు.
అందుకే అన్నపూర్ణ స్టూడియోస్ తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని చెప్పారు. ఇది కేవలం షూటింగుల స్థలం కాదు, వేలాదిమంది నూతన దర్శకులు, నటుల కలల దేవాలయం. కలలతో ఇండస్ట్రీలోకి వచ్చే వారికి ఓ వేదిక కల్పించాలన్న ఏఎన్నార్ ఆలోచననే తాము ముందుకు తీసుకెళ్తున్నామని నాగ్ భావోద్వేగానికి గురయ్యారు.
'హలో బ్రదర్' మేనియా..
తండ్రి 'మాస్' సినిమా థియేట్రికల్ రచ్చను మొదటిరోజే మొదటి షోలో అభిమానుల మధ్య చూడటం మరచిపోలేని అనుభవమని చైతన్య గుర్తుచేసుకున్నాడు, తండ్రి ఆడియో లాంచ్ నాటి జనసందోహమే తనకు అసలైన రియాలిటీ చెక్ అని అఖిల్ తెలిపాడు. విశేషమేమిటంటే, ఈ ఇద్దరు సోదరులకూ నాగ్ నటించిన 'హలో బ్రదర్' అంటే తెగ పిచ్చి అని చెప్పుకొచ్చారు. VHS టేపులు అరిగిపోయేలా వందలసార్లు చూశామని నవ్వుతూ పంచుకున్నారు.
ALSO READ : టికెట్ రేట్లు పెంచుకుంటే 20% వాటా ఇవ్వాల్సిందే..
ట్రెండ్ మారుతోంది...
వారసత్వంతో వచ్చే ఒత్తిడి గురించి కూడా ముగ్గురూ మనసు విప్పారు. 250 సినిమాలు చేసిన ANR కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు తనపై కొండంత ఒత్తిడి ఉండేదని, స్వంత ముద్ర వేసుకోవడానికి 30 సినిమాలు పట్టిందని నాగార్జున తెలిపారు.. అదే ఒత్తిడి ఇప్పుడు తన కుమారులపైనా ఉందన్నారు. అయితే ఫిర్యాదులకు తావులేదని, చేతికి అందిన 'బంగారు బ్యాటన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడమే బాధ్యత' అని అఖిల్ అన్నాడు.
'గీతాంజలి', 'శివ' వంటి చిత్రాలతో తనదైన దారిని ఎంచుకున్నట్టే, తన కుమారులు కూడా సాహసోపేతమైన నిర్ణయాలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్నారు నాగార్జున . నేటితరం హీరోలు కూడా ఫార్ములా సినిమాలకు పరిమితం కాకుండా రిస్క్ తీసుకోవాలని కొడుకులకు సూచించారు. విజయాన్ని పునరావృతం చేయాలనే భయం కళాకారుడి సహజత్వాన్ని దెబ్బతీయకూడదని చైతన్య అభిప్రాయపడ్డాడు.
ఓటీటీపై ప్రత్యేక ఆసక్తి..
ఇక ఓటీటీపై ప్రత్యేక ఆసక్తి ఉందని తెలపారు చైతన్య.. థియేటర్‌లో సాధ్యం కాని భిన్నమైన పాత్రలు, కథలను డిజిటల్ వేదికపై అన్వేషించేందుకు అవకాశం ఉంటుందని చెప్పాడు. మరోవైపు కుటుంబంలో పని, వ్యక్తిగత జీవితాన్ని వేరుగా ఉంచుకోవడం తమకు చిన్నప్పటి నుంచే అలవాటని అఖిల్ వెల్లడించాడు. సినిమా ఎంత సీరియస్ వ్యాపారమైనా, రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గర మాత్రం 'ఓన్లీ ఫ్యామిలీ ముచ్చట్లే' అని చెప్పారు
మొత్తానికి వారసత్వం అంటే కేవలం స్టార్‌డమ్ కాదు, సినిమాపై చూపించే గౌరవం అని ఈ అక్కినేని త్రిమూర్తులు చాటిచెప్పారు. 'ఆసక్తిని కాపాడుకోండి.. క్రమశిక్షణను వదలకండి.. మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దు ' అక్కినేని వారసత్వం అంటే ఇదే. తరాలు మారినా.. తెర మారినా.. సినిమాపై తమ ప్రేమ మాత్రం మారదు అని ఈ అక్కినేని ఫ్యామిలీ మరోసారి స్పష్టం చేసింది.
