టికెట్ రేట్లు పెంచుకుంటే 20% వాటా ఇవ్వాల్సిందే.. నిర్మాతలకు తెలంగాణ సర్కార్ స్ట్రాంగ్ రూల్!

టికెట్ రేట్లు పెంచుకుంటే 20% వాటా ఇవ్వాల్సిందే.. నిర్మాతలకు తెలంగాణ సర్కార్ స్ట్రాంగ్ రూల్!

తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ రేట్లు పెంచుకోండి. కానీ టికెట్ రేట్లు పెంచడం వల్ల  సినిమాల నుంచి వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాల్సిందే అని తేల్చిచెప్పింది. ఈ  మేరకు ఒక కఠినమైన రూల్ పాస్ చేసింది.

ఈ నిబంధన ప్రకారంగా టికెట్ల పెంపు ద్వారా  ప్రేక్షకుల నుంచి వచ్చే అదనపు ఆదాయంలో సరిగ్గా ఐదో వంతు భాగాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC) లేదా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఖాతాలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జిబిటర్ల నుంచి ఆ మొత్తాన్ని నిర్మాతలే వసూలు చేసే పూర్తి బాధ్యతను కూడా నిర్మాణ సంస్థలపైనే ప్రభుత్వం పెట్టింది.

ఈ నిబంధనకు సంబంధించి 'అఖండ-2','ది రాజాసాబ్', 'మన శంకర వర ప్రసాద్ గారు', 'పెద్ది' చిత్రాల నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేకంగా లేఖలు పంపింది . టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చిన అదనపు రాబడిలో 20 శాతం సంక్షేమ నిధికి మళ్లించే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించింది. ఇప్పటికే 'అఖండ-2'కు ప్రత్యేక ప్రీమియర్ షోతో పాటు మూడు రోజులపాటు పెంచిన టికెట్ ధరలకు అనుమతి లభించింది. 'పెద్ది'కి కూడా ప్రత్యేక షో, పెంచిన ధరలకు అనుమతి ఇవ్వగా, అదనపు ఆదాయంలో 20 శాతం సంక్షేమ నిధికి ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ALSO READ : ఎన్టీఆర్–త్రివిక్రమ్ చిత్రానికి 'గాడ్ ఆఫ్ వార్' నా?

సినీపరిశ్రమలో టికెట్ ధరల పెంపు అనేది నిర్మాతలకు పెద్ద ప్లస్ పాయింట్ అయినా.. థియేటర్లలో రోజూ చెమటోడ్చే కార్మికుల సంక్షేమాన్ని మర్చిపోతే కుదరదని ప్రభుత్వం తెగేసి చెప్పింది. సినిమా నుంచి వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం సినీ కార్మికుల కోసం ఖర్చు చేయాలని స్పష్టం చేసింది.  పైసా పైసా పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు సదరు నిర్మాతలు వెంటనే ఆ మొత్తాన్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. మరి ఈ బిగ్ ప్రొడ్యూసర్లు ఎప్పటికి ఆ బకాయిలను కట్టేసి మ్యాటర్ సెటిల్ చేస్తారో వేచి చూడాలి..