- సామాజిక వైరుధ్యాలే రచనకు పునాది అని వెల్లడి
- కులాల మధ్య సమానత్వం ఎక్కడ? ఉస్మానియా అనుభవాలే పుస్తకం రాసేలా చేశాయని వ్యాఖ్య
జూబ్లీహిల్స్, వెలుగు: అయోధ్య రథయాత్ర సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన పరిణామాలు, ‘మనమంతా హిందువులం’ అన్న నినాదమే తనతో
‘వై ఐ యామ్ నాట్ ఏ హిందూ బుక్’ను రాసేలా చేసిందని ప్రముఖ రచయిత కంచ ఐలయ్య వివరించారు. కుల వ్యవస్థ, సామాజిక అసమానతలు, హిందూ సమాజంలోని అంతర్గత వైరుధ్యాలపై తన ఆలోచనలను ప్రేరేపించాయన్నారు.
మంగళవారం బంజారాహిల్స్‌లోని లమాకాన్‌లో ఆయన రాసిన ‘వై ఐ యామ్ నాట్ ఏ హిందూ బుక్’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ, ఆర్ట్స్ కాలేజీ కారిడార్‌లో ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తరచూ నినాదాలు చేసేవారని గుర్తుచేశారు. వారి ఆందోళనలపై పోలీసులు చర్యలు తీసుకున్నప్పుడల్లా తరగతుల బహిష్కరణకు పిలుపునిచ్చేవారని చెప్పారు.
ఆ సమయంలో ‘మనమంతా హిందువులం’ అనే నినాదం తనలో తీవ్ర ప్రశ్నలు రేకెత్తించిందన్నారు. ఆ నినాదానికి తారకంగా ‘గంగ సింధు బిందువులం’ అనే మాటను జోడించారని, కానీ వాస్తవ జీవితంలో కులాల మధ్య సమానత్వం ఎక్కడ ఉందనే ప్రశ్న తనను వెంటాడిందని చెప్పారు. సివిల్ లిబర్టీస్ ఉద్యమంతో పనిచేసే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కుల వ్యవస్థ, వృత్తులు, పరికరాలు, దేవుళ్లు, దేవతల గురించి దగ్గరగా తెలుసుకున్నానని ఐలయ్య తెలిపారు.
దేశవ్యాప్తంగా ‘జై శ్రీరామ్’ నినాదం మారుమోగుతున్నా.. తన గ్రామీణ జీవితంలో ఆ పేరు దేవుడిగా అంతగా పరిచయం లేదన్నారు. ఈ అనుభవాల నేపథ్యంలో కులం, వ్యక్తిగత జీవితం, సామాజిక రాజకీయాల మధ్య ఉన్న సంబంధాలపై రాయాలనే ఆలోచన తనలో మొదలైందని చెప్పారు. హైదరాబాద్‌లోని మహిళా సంస్థ ‘స్త్రీ శక్తి సంఘటన’లో జరిగిన చర్చలు కూడా తన ఆలోచనలను ప్రభావితం చేశాయని తెలిపారు.
ముఖ్యంగా ‘పర్సనల్ ఈజ్ పొలిటికల్’ అనే భావన తనను ఆలోచింపజేసిందన్నారు. కుటుంబం, భార్యాభర్తల సంబంధాలు, వ్యక్తిగత జీవితం రాజకీయాలతో ఎలా ముడిపడి ఉంటాయనే చర్చల నేపథ్యంలో.. “నా వ్యక్తిగతమైనది ఏమిటి? నా కులమే కదా. నా తల్లిదండ్రులు ఎవరు? వారి సామాజిక పరిస్థితి ఏమిటి?” అనే ప్రశ్నలు తనలో తలెత్తాయని వివరించారు.
తాను తెలుగు మీడియం విద్యార్థినని, ఇంగ్లిషులో రచనలు చేయడానికి ప్రత్యేక శిక్షణ లేదని ఐలయ్య చెప్పారు. బీఏ, పీయూసీలో థర్డ్ క్లాస్ మార్కులు రావడంతో జేఎన్టీయూలో ప్రవేశం కూడా కోల్పోయానని గుర్తుచేశారు. అయినా ఇంగ్లిషులోనే పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నానన్నారు. తెలుగులో రాస్తే స్థానికంగా తన రచనను అణచివేసే అవకాశం ఉందని భావించానని, ఇంగ్లిషులో రాస్తే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ఎవరో ఒకరు చదివే అవకాశం ఉంటుందని అనుకున్నానని చెప్పారు.
తన సివిల్ లిబర్టీస్ సహచరులకు కూడా చెప్పకుండా రహస్యంగా రచన ప్రారంభించానని ఐలయ్య తెలిపారు. అప్పట్లో వారు తనను రచయితగా, మేధావిగా కాకుండా ఉద్యమాల్లో పాల్గొనే సాధారణ వ్యక్తిగానే చూసేవారని చెప్పారు. కులం, వ్యక్తిగత అనుభవం, సామాజిక అసమానతలపై తనలో ఏర్పడిన ప్రశ్నలే చివరకు తన రచనా ప్రయాణానికి పునాది వేశాయని కంచ ఐలయ్య వెల్లడించారు.
